ముంబై: విజయ శంకర్ స్థానంలో టీమిండియా జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడం వెనక కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి ఉన్నట్లు తెలుస్తోంది. విజయ శంకర్ స్థానంలో తమకు మాయాంక్ అగర్వాల్ కావాలని వారు పట్టుబట్టినట్లు సమాచారం. అందుకే అంబటి రాయుడిని కాకుండా మాయాంక్ అగర్వాల్ ను బిసిసిఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

ప్రపంచ కప్ పోటీలకు టీమిండియా జట్టులోకి అంబటి రాయుడిని తీసుకోకపోవడంతోనే సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. స్టాండ్ బై ప్లేయర్ గా ఉన్న అంబటి రాయుడిని విజయ శంకర్ స్తానంలో ఎంపిక చేయకపోవడం మరోసారి ఆశ్చర్యానికి గురి చేసింది. అంబటి రాయుడిని, అజింక్యా రహనేలను పక్కన పెట్టి మాయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం వెనక టీమిండియా మేనేజ్ మెంట్ కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. 

మాయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడంలో బిసిసిఐ సెలెక్టర్ల ప్రమేయం ఏమీ లేదని, విజయ శంకర్ స్థానంలో తమకు మాయాంక్ అగర్వాల్ కావాలని టీమ్ మేనేజ్ మెంట్ పట్టుబట్టిందని అంటున్నారు. 

అయితే, మాయాంక్ అగర్వాల్ ఇండియా ఎ టీమ్ లో అద్భుతమైన ఫామ్ కనబరిచాడు. కర్ణాటకకు చెందిన మాయాంక్ అగర్వాల్ కేవలం నాలుగు మ్యాచుల్లో 287 పరుగులు చేశాడు. సగటు 71.75 ఉండగా,త స్ట్రయిక్ రేట్ 105.90 ఉంది. 

రాయుడు కాకుండా మాయాంక్ ను ఎంపిక చేయాలని నిర్ణయించుకుంది ఐదుగురు సభ్యుల సెలెక్షన్ కమిటీ కాదని, టీమ్ మేనేజ్ మెంట్ మాత్రమేనని తెలుస్తోంది. 2018లో ఇంగ్లాండు, వెస్టిండీస్ లతో ఇండియా ఎ ముక్కోణపు పోటీల్లో కనబరిచిన ప్రదర్శన కూడా మాయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేసుకోవడం వెనక ఉందని అంటున్నారు. 

సంబంధిత వార్త

తీవ్ర అసంతృప్తి: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై