ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న  ప్రపంచ కప్ టోర్నీకి వర్షం పెద్ద అడ్డంకిగా నిలుస్తోంది. ఇంచు మించు ప్రతి మ్యాచ్ కు వర్ష భయం వెంటాడుతోంది. ఇలా చాలా మ్యాచ్ లు ఫలితం తేలకుండానే రద్దయ్యాయి కూడా. తాజాగా బ్రిస్టల్ లో కురుస్తున్న భారీ వర్షంతో ఉపఖండ దేశాలు శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ నిలిచిపోయింది. టాస్ కూడా జరగనివ్వకుండా విరామం లేకుండా వర్షం కురుసింది. దీంతో ఇక మ్యాచ్ జరపడం సాధ్యం కాదని భావించిన నిర్వహకులు ఈ మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో శ్రీలంక, బంగ్లాదేశ్ లకు చెరో పాయింట్ అందించారు.   

ఇప్పటివరకు ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా-వెస్టిండిస్, పాకిస్థాన్-శ్రీలంక ల మధ్య జరగాల్సిన మ్యాచులు వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యాయి. తాజాగా ఈ మ్యాచ్ తో ఈ  మ్యాచ్ కూడా అదే విధంగా వర్షార్పణమయ్యింది. ఇక మరికొన్ని మ్యాచులకు మధ్యలో వర్షం అంతరాయం కలిగించడంతో ఓవర్లు కుదించాల్సి వచ్చింది. ఇలా ప్రతి మ్యాచ్ లో వర్షం అభిమానుల సహనాన్ని పరీక్షిస్తోంది. దీంతో నాలుగేళ్లకోసారి జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీపై అభిమానుల్లో అంతకంతకు ఆసక్తి తగ్గుతోంది.