ఇంగ్లాండ్ జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీకి వర్షం అడ్డంకిగా మారింది. ఇంచుమించుగా  ప్రతి మ్యాచ్ లో వరుణుడు భయపెడుతుండగా...కొన్ని మ్యాచులయితే ఏకంగా ఫలితం తేలకుండానే రద్దవుతున్నాయి. అలా సోమవారం సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికా, వెస్టిండిస్  ల మధ్య జరుగుతున్న మ్యాచ్ ఫలితం తేలకుండానే అర్థాంతరంగా ఆగిపోయింది. 

సఫారి జట్టు 7.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 29 పరుగుల వద్ద వున్నపుడు ఒక్కసారిగా జోరున వర్షం మొదలయ్యింది. దీంతో వెంటనే అంపైర్లు మ్యాచ్ ను నిలిపేశారు. ఆ వెంటనే గ్రౌండ్ సిబ్బంది పిచ్ పై భారీ  కవర్లు కప్పి తడవకుండా జాగ్రత్తపడ్డారు. అయితే ఎంతసేపటికి వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి  ఇరు జట్లకు చెరో పాయింట్ పంచారు. 

ఇప్పటికే వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిని దక్షిణాఫ్రికా జట్టుకు వర్షంరూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. విండీస్ కలిసి పాయింట్లు పంచుకోవడం ద్వారా లీగ్ దశను దాటి ముందుకెళ్లే అవకాశాలను ఆ జట్టు మరింత క్లిష్టం చేసుకుంది.  

ప్రపంచ కప్ లో వరుసగా మూడు  ఓటముల తర్వాత కూడా  దక్షిణాఫ్రికా ఆటతీరులో మార్పులేమి కనిపించడం లేదు. ముఖ్యంగా బ్యాట్ మెన్స్ ఈ అపజయాల నుండి ఏమీ నేర్చుకున్నట్లు లేరు. అందువల్లే విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా అదే పేలవ ఆటతీరుతో వికెట్లను చేజార్చుకుంటోంది. ఇలా ఇప్పటికే  ఇద్దరు టాప్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ ఔటై పెవిలియన్ కు చేరారు. మొదట ఆమ్లా ఆ తర్వాత మార్క్రమ్(5 పరుగులు) లు ఔటయ్యారు. ఇద్దరినీ విండీస్ బౌలర్ కోట్రెల్ బలితీసుకున్నాడు. 

ప్రపంచ కప్ లో భాగంగా  వెస్డిండిస్ తో జరుగుతున్న మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మరోసారి తడబడుతోంది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆ జట్టు కేవలం 11 పరుగుల వద్దే మొదటి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ ఆమ్లా(6 పరుగులు) ను  విండీస్ బౌలర్ కాట్రెల్ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించి పెవిలియన్ కు పంపించాడు. 

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్  మెగా టోర్నీలో ఇవాళ మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ(సోమవారం) విండీస్ తో  తలపడుతోంది. విండీస్ కూడా పాకిస్తాన్ పై ఘన విజయంతో ఈ టోర్నీని  ఘనంగా ఆరంభించిని చివరి మ్యాచ్ లో చతికిల పడింది. దీంతో ఇరుజట్లు ఈ మ్యాచ్ గెలిచి విజయాలబాట పట్టాలని చూస్తున్నాయి. 

మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన టాస్ గెలుచుకున్న విండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్ జరుగుతున్న సౌతాంప్టన్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం వుండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయి.   

తుది జట్లు:

సౌతాఫ్రికా టీం:

క్వింటన్ డికాక్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, మర్క్రమ్, డుస్సెన్,  డేవిడ్ మిల్లర్, ఫెహ్లుక్వాయో, మొర్రీస్, కగిసో రబాడ, హెండ్రిక్స్,  ఇమ్రాన్ తాహిర్ 

విండీస్ టీం:

క్రిస్ గేల్, డారెన్ బ్రావో,హోప్స్, నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్ హోల్డర్, బ్రాత్ వైట్, నర్స్, రోచ్, కోట్రెల్, థామస్