శ్రీలంకపై చివరి లీగ్ మ్యాచులో శనివారం భారత్ ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మతో పాటు కెఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగి శ్రీలంకపై సునాయస విజయానికి తోడ్పడ్డారు. దీంతో శ్రీలంకపై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన లంకను 264 పరుగులకే కట్టడి చేసిన టీమిండియా 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ప్రపంచ కప్ లో మంచి ఫామ్ తో పరుగుల వరద పారిస్తున్న ఓపెనర్ రోహిత్ శర్మ మరో శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. అతడు 94 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అతడు ఔటైన తర్వాత రాహుల్ షో ప్రారంభమైంది. అతడు సమయోచితంగా ఆడుతూ ప్రపంచకప్ లో మొదటి సెంచరీ బాదాడు. 118 బంతుల్లో 111 పరుగులు చేసిన అతడిని చివరకు మలింగ పెవిలియన్ కు చేర్చాడు.

అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.ఓపెనర్లిద్దరు ఏకంగా 189 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర సృష్టించారు. వీరిద్దరు ఔటయిన తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ(34 పరుగులు) పాండ్యా(7 పరుగులు)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చారు. శ్రీలంక బౌలర్లలో మలింగ,రజిత, ఉదానా తలో వికెట్ పడగొట్టారు. 

టీమిండియా ఓపెనర్ రోహిత్ జోరు శ్రీలంక పై కూడా కొనసాగింది. ఈ మ్యాచ్ లో కూడా సెంచరీతో చెలరేగిన రోహిత్ హ్యాట్రిక్ సెంచరీలను పూర్తిచేసుకున్నాడు. మొత్తంగా ఈ ప్రపంచ కప్ లో అతడి ఖాతాలోకి ఐదో శతకం చేరింది. 92 బంతుల్లోనే రోహిత్ తన సెంచరీని పూర్తిచేసుకున్నాడు.   

  ఈ ప్రపంచ కప్ లో చివరి మ్యాచ్ ఆడుతున్న శ్రీలంకను మాథ్యూస్ అద్భుత సెంచరీతో ఆదుకున్నాడు. కేవలం 55 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన సమయంలో బ్యాటింగ్ కు దిగిన మాథ్యూస్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. అతడికి తిరుమన్నె నుండి సహకారం దక్కడంతో వీరిద్దరు మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరి భాగస్వామ్యం ఫలితమే లంక 264 పరుగుల స్కోరు. 

ఇలా మాథ్యూస్ సెంచరీ(113 పరుగులు), తిరుమన్నె (53 పరుగులు) హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. వీరి తర్వాత డిసిల్వా 29, ఫెర్నాండో 20 పరుగులు చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి లంక 264 పరుగులు చేసింది. 

భారత  బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో మరోసారి అదరగొట్టాడు. ఇక భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లు తలో వికెట్ పడగొట్టారు.  అయితే ఆరంభంలో బౌలర్లు అదరగొట్టినా మిడిల్ ఓవర్లలో లయ కోల్పోయారు. దీంతో కుదురుకున్న లంక బ్యాట్ మెన్స్ గౌరవప్రదమైన టోటల్ అందించగలిగారు. 

 మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి లంక వికెట్ల  పతనాన్నిఅడ్డుకున్న మాథ్యూస్,తిరుమన్నె జోడిని కుల్దీప్ విడగొట్టాడు. హాఫ్ సెంచరీ చేసిన వెంటనే తిరుమన్నె(53 పరుగులు) ను కుల్దీప్ ఓ అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో 179 పరుగుల వద్ద లంక ఐదో వికెట్ కోల్పోయింది. 55 పరుగులకే  నాలుగు వికెట్లు కోల్పోయిన లంకను ఈ భాగస్వామ్యమే గౌరవప్రదమైన స్కోరు చేసేలా సహాయపడింది.  

బుమ్రా విసిరే బుల్లెట్లలాంటి యార్కర్లకు లంక టాప్ ఆర్డర్ బెంబేలెత్తిపోతోంది.  ఓపెనర్లు కరుణరత్నే (10 పరుగులు), కుషాల్ పెరీరా(18 పరుగులు) ను కూడా బుమ్రా ఆదిలోనే ఔట్ చేశాడు. దీంతో కేవలం 40 పరుగులకే లంక  ఇద్దరు ఓపెనర్లను  కోల్పోయి కష్టాల్లోకి జారుకుంది. 

 ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్ కు  చేరింది. అయితే ఈ టోర్నీలో టాప్ ప్లేస్ కు చేరాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో కోహ్లీసేన అదరగొట్టింది. తమ విజయ యాత్రలో కొనసాగింపుగా లంకను ఓడించి పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానానికి  చేరింది. ఇప్పటికే  సెమీస్ అవకాశాలు కోల్పోయిన లంక ఈ మెగాటోర్నీని ఓటమితో ముగించింది.  

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం నిర్వహించిన టాస్ ను శ్రీలంక గెలుచుకుంది. దీంతో కెప్టెన్ కరుణరత్నే మొదట బ్యాటింగ్  చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో టీమిండియా మరోసారి చేజింగ్ చేయాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో రెండు మార్పులు చేపట్టినట్లు కోహ్లీ తెలిపాడు. చాహల్, షమీ లకు విశ్రాంతినిచ్చి వారి  స్థానాల్లో కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలను 
ఆడిస్తున్నట్లు తెలిపాడు.  

తుది జట్లు:

ఇండియా:

రోహిత్ శర్మ,  కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), రిషబ్ పంత్, ఎంఎస్ ధోని(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర  జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ సింగ్ బుమ్రా

శ్రీలంక;

దిముత్ కరుణరత్నే(కెప్టెన్), కుషాల్ మెండిస్(వికెట్ కీపర్), అవిష్కా ఫెర్నాండో, కుషాల్ మెండిస్, ఆంజెలో మాథ్యూస్, లహురు తిరుమన్నె, ధనంజయ  డిసిల్వా, ఇసురు ఉదాన, లసిత్ మలింగ, కసున్ రజిత, తిసార పెరేర