ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్-అప్ఘానిస్థాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ 397 పరుగుల భారీ స్కోరు సాధించడంతోనే దాదాపు విజయాన్ని ఖాయం చేసుకుంది. అయితే  ఆటలో భాగంగా ఛేదన కోసం బ్యాటింగ్ కు దిగిన అప్ఘాన్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 248 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్ 150 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 

398 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకిి దిగిన అప్ఘాన్్ ఆదిలోోనే షాక్ తగిలింది. ఓపెనర్ నూర్ అలీ డకౌటయ్యాడు. అయితే కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ 78(28 బంతుల్లో 37 పరుగులు), రహ్మత్ షా( 74 బంతుల్లో 46 పరుగులు) మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  అయితే సాధించాల్సిన రన్ రేట్ చాలా  ఎక్కువగా వుండటంతో వేగంగా ఆడటానికి ప్రయత్నించి వీరిద్దరు ఔటయ్యారు. ఆ తర్వాత కూడా షాహిది 76, అస్ఘన్  అప్ఘాన్ 44 పరుగులతో ఆకట్టుకున్నా అప్ఘాన్ కు విజయాన్ని అందించలేకపోయారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆర్చర్, రషీద్ లు మూడేసి వికెట్లు పడగొట్టారు. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశారు. 

అంతకుముందు  పసికూన అప్ఘాన్ పై ఆతిథ్య ఇంగ్లాండ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఆ  జట్టు బౌర్లలపై కాస్తయినా  కనికరం చూపించకుండా ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఊచకోత కోశాడు. కేవలం 71  బంతుల్లోనే 17 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 148 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ఓపెనర్ బెయిర్ స్టో 90, రూట్ 88 పరుగులతో రాణించారు. ఇక చివర్లో మోయిన్ అలీ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి 9 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లాండ్ 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

అప్ఘాన్ స్పిన్ బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్ ను ఇంగ్లాండ్ ఆటగాళ్లు చితక్కొట్టారు. దీంతో కేవలం 9 ఓవర్లలోనే ఏకంగా 110 పరుగులు సమర్పించుకున్నాడు. దవ్లత్ జద్రాన్  ఒక్కడే 3 వికెట్లు పడగొొట్టి కాస్త పరవాలేదనిపించాడు. కెప్టెన్ గుల్బదిన్ నయిబ్ కూడా మూడు వికెట్లు పడగొట్టాడు. 

 ప్రపంచ కప్ టోర్నీలో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు మరో రసవత్తర పోరుకు అద్భుత విజయాన్ని అందుకుంది. అప్ఘానిస్థాన్ టీంతో మాంచెస్టర్ వేదికన జరగిన ఈ మ్యాచ్ లో టాస్ ను   ఆతిథ్య జట్టే గెలుచుకుంది. దీంతో కెప్టెన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకుని అప్ఘాన్ ముందు భారీ లక్ష్యాన్ని వుంచాడు.  

ఈ మ్యాచ్ కోసం ఆతిథ్య జట్టు రెండు మార్పులు చేపట్టింది. గాయం  కారణంగా ఓపెనర్ జేసన్ రాయ్  జట్టుకు దూరమయ్యాడు. అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడుతున్న ప్లంకెట్ సేవలను కూడా జట్టు మిస్సవుతోందని మోర్గాన్ తెలిపాడు. వీరిద్దరి స్థానంలో జేమ్స్ విన్స్, ఆదిల్ రషీద్ లు జట్టులోకి వచ్చారు. 

అప్ఘాన్  జట్టులో మూడు మార్పులు చోటుచేసుకున్నాయి.  హజ్రతుల్లా జజాయి, హమీద్ హసన్, అప్తాబ్ ఆలంలకు తుది జట్టులో చోటు దక్కలేదు. వీరి  స్థానంలో నజీబుల్లా జద్రాని, ముజీబ్ ఉర్ రహ్మాన్, దవ్లత్ ఖాన్ లు అప్ఘాన్ జట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ నయిబ్ వెల్లడించాడు.  
 

తుది జట్లు:

అఫ్ఘాన్ టీం: 

నూర్ అలీ జద్రాన్, గుల్బదిన్ నయిబ్(కెప్టెన్), రహ్మత్ షా, అష్మతుల్లా షాహిది, అస్ఘార్ అప్ఘాన్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రామ్ అలిఖిల్(వికెట్ కీపర్),  రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, దవ్లత్ ఖాన్ 

ఇంగ్లాండ్ టీం:

జోని బెయిర్ స్టో, జేమ్స్ విన్స్, జో రూట్, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), మోయిన్  అలీ, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, జోప్రా ఆర్చర్, మార్క్ వుడ్