బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఇంగ్లాండుపై జరుగుతున్న మ్యాచులో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన మార్క్ ను చూపించాడు. తుది జట్టులో ఇప్పటి వరకు అతనికి స్థానం లభించలేదు. అయితే, కేఎల్ రాహుల్ గాయపడడంతో అతని స్థానంలో మైదానంలోకి వచ్చి ఫీల్డింగ్ చేశాడు. 

భారత బౌలర్లను ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ ఉతికి ఆరేస్తున్న తరుణంలో జడేజా ఫీల్డింగ్ అద్భుతమైన ఫలితం ఇచ్చింది. స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన 23వ ఓవర్‌లో రాయ్‌ లాంగ్ ఆన్‌ మీదుగా భారీ షాట్ కొట్టాడు. జడేజా ముందుకు దూకుతూ బంతిని అందుకున్నాడు. దీంతో 160 పరుగుల ఇంగ్లాండు తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

ఆ క్యాచ్ కు ఫిదా అయిన నెటిజన్లు జడేజాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జట్టుకు నువ్వు దూరమైన మ్యాచ్‌ నుంచి నిన్ను ఎవరూ దూరం చేయలేరని ఒకరు కామెంట్ చేశారు, ఈ మ్యాచ్‌లో జడేజా 20-25 పరుగులను కట్టడి చేశాడని మరొకరు వ్యాఖ్యానించారు. 

జడేజా క్యాచ్ చూసిన తర్వాత అందరూ అతన్ని జట్టులో  ఎందుకు తీసుకోలేదని తప్పకుండా ప్రశ్నిస్తారని అన్నారు.