మాంచెస్టర్‌: పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ వల్ల భారత ఓపెనర్ రోహిత్ శర్మ బతికిపోయాడు. రన్నవుట్ చేసే అవకాశాన్ని వదులుకున్న పాకిస్తాన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. 

టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. సెంచరీ భాగస్వామ్యంతో పాక్‌పై కొత్త రికార్డు సృష్టించారు. రోహిత్ శర్మ ఏకంగా 113 బంతుల్లో 140 పరుగులు చేసి పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 

అయితే భారత్‌ ఇన్నింగ్స్‌ సందర్బంగా పదో ఓవర్‌లో పాక్‌ చెత్త ఫీల్డింగ్‌ కారణంగా రోహిత్ శర్మ అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పాక్‌ బౌలర్‌ వాహబ్‌ రియాజ్‌ వేసిన పదో ఓవర్‌ తొలి బంతిని ఎదుర్కొన్న రాహుల్‌ మిడ్‌ వికెట్‌వైపు తరిలించి పరుగు తీసే ప్రయత్నం చేశాడు. అయితే రాహుల్‌ అంతగా ఆసక్తి లేకున్నా రోహిత్‌ అనవసరంగా రెండో రన్‌ కోసం క్రీజు మధ్యలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. 

అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న ఫఖర్‌ జామన్‌ తొందరలో బంతిని కీపర్‌కు కాకుండా రెండో ఎండ్‌కు విసిరేశాడు. దీంతో అప్రమత్తమైన రోహిత్‌ వెంటనే తిరిగి క్రీజులోకి వెళ్లాడు. అయితే ఫఖర్‌ బంతిని కీపర్‌కు అందించి ఉంటే రోహిత్ అవుటయ్యేవాడే. దీంతో పాక్‌ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అప్పటికి రోహిత్‌ 32 పరుగులు మాత్రమే చేశాడు.