సౌథాంప్టన్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో భారత బౌలర్ మొహమ్మద్ షమీ తన హ్యాట్రిక్ తో విజయాన్ని అందించాడు. షమీ హ్యాట్రిక్ కారణంగా భారత్ అఫ్గానిస్తాన్ పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ఐసిసి ప్రపంచ కప్ 2019 ఎడిషన్ లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలరుగా షమీ ఘనత సాధించాడు. ప్రపంచ కప్ పోటీల్లో హ్యాట్రిక్ సాధించిన రెండో భారత బౌలరుగా కూడా అతను రికార్డు సృష్టించాడు. గతంలో చేతన్ శర్మ హ్యాట్రిక్ సాధించాడు. 

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ చేతన్ శర్మ 1987లో  న్యూజిలాండ్ పై హ్యాట్రిక్ సాధించాడు. తద్వారా ప్రపంచ కప్ పోటీల్లో హ్యాట్రిక్ సాధించిన ఏకైక భారత బౌలరుగా కొనసాగుతూ వస్తున్నాడు. అయితే, షమీ హ్యాట్రిక్ సాధించి రెండో భారత బౌలరుగా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా హ్యాట్రిక్ సాధించిన పది మంది క్రికెటర్ల జాబితాలో షమీ చేరాడు. 

ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ పోటీల్లో మొహమ్మద్ షమీ తొలి నాలుగు మ్యాచులకు దూరంగా ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో అతను తుది జట్టులోకి వచ్చాడు. తనకు అంది వచ్చిన అవకాశాన్ని షమీ చక్కగా ఉపయోగించుకున్నాడు. 

అఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచులో షమీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. 40 పరుగులు ఇచ్ిచన హజ్రతుల్లా జజాయ్ (10), మొహమ్మద్ నబీ (52), అఫ్తాబ్ ఆలం (0), ముజీబుర్ రహ్మాన్ (0) వికెట్లు తీసుకున్నాడు.

తుది ఓవరులో విజయం చేజారిపోతుందనే ఆందోళన భారత జట్టులో కనిపించింది. ఫైనల్ ఓవరులో అఫ్గానిస్తాన్ కు 9 పరుగులు కావాల్సి ఉండింది. ఊపు మీదున్న నబీ క్రీజులో ఉన్నాడు. బౌండరీతో నబీ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత బంతికి షమీ పరుగులేమీ ఇవ్వలేదు. తర్వాతి మూడు బంతుల్లో వరుసగా నబీ, ఆలం, ముజీబ్ వికెట్లను షమీ పడగొట్టాడు. ఒక్క బంతి మిగిలి ఉండగా అఫ్గాన్ పరాజయం పాలైంది.