బంగ్లాదేశ్ తమ ముందు ఉంచిన 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దక్షిణాఫ్రికా చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లో నష్టానికి 309 పరుగులు చేసి పరాజయం పాలైంది. దీంతో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. బంగ్లాదేశ్ బౌలర్లు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీసుకోగా, సైఫుద్దీన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. మెహిదీ, షకీబ్ ఆల్ హసన్ తలో వికెట్ తీసుకున్నారు. 

అంతకు ముందు 287 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.డుమినీ 45 పరుగులు చేసి ముస్తాఫిజుర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి 16 బంతుల్లో దక్షిణాఫ్రికా 44 పరుగులు చేయాల్సి ఉండింది.దక్షిణాఫ్రికా 275 పరుగుల స్కోరు వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. అప్పటికి 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన స్థితిలో పడింది.

దక్షిణాప్రికా 252 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. పెహ్లివూక్వాయో 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొహమ్మద్ సైఫుద్దీన్ బౌలింగులో అవుటయ్యాడు.దక్షిణాఫ్రికా 228 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. డుస్సేన్ మొహమ్మద్ సైఫుద్దీిన్ బౌలింగులో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు.

దక్షిణాఫ్రికా 202 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.35.1 ఓవర్ల వద్ద మిల్లర్ నాలుగో వికెట్ గా వెనుదిరిగాడు. అతను 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ముస్తాఫిజూర్ రహ్మాన్ బౌలింగులో అవుటయ్యాడు.

దక్షిణాఫ్రికా 147 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. డూ ప్లెసిస్ 53 బంతుల్లో 62 పరుగులు చేసి హసన్ మిరాజ్ బౌలింగులో మూడో వికెట్ గా వెనుదిరిగాడు. అంతకు ముందు డికాక్ 23 పరుగులు చేసి రన్నవుటయ్యాడు. మర్క్రామ్ 45 పరుగులు చేసి షకీబ్ ఆల్ హసన్ బౌలింగులో వెనుదిరిగాడు.

పసికూన బంగ్లాదేశ్ పటిష్టమైన దక్షిణాఫ్రికాను చితక్కొట్టింది. ఎక్కడా తడబడకుండా దూకుడుగా ఆడిన బంగ్లా... నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 330 పరుగులు చేసింది. తద్వారా సఫారీల ముందు 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ముష్పీకర్ రహీమ్ 78, షకీబ్ ఉల్ హసన్ 75, మహమ్మదుల్లా 46, సౌమ్య సర్కార్ 42 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో పెహ్లుక్‌వాయో, క్రిస్ మోరీస్, ఇమ్రాన్ తాహిర్ తలో 2 వికెట్లు పడగొట్టారు.ధాటిగా ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన ముష్ఫీకర్ రహీమ్‌ 78 పరుగుల వద్ద పెహ్లుక్‌వాయో బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

ఇమ్రాన్ తాహిర్ మరోసారి విజృంభించాడు. విధ్వంసక ఆటగాడు మొహ్మద్ మిథున్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మిథున్ 21 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి.

ప్రమాదకరంగా మారిన షకీబ్, ముష్పీకర్ జంటను ఇమ్రాన్ తాహిర్ విడదీశాడు. 84 బంతుల్లో 75 పరుగులు చేసి సెంచరీ దిశగా దూసుకెళ్తున్న షకీబ్ ఉల్ హసన్‌‌ను తాహిర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ముష్ఫీకర్ రహీమ్ అర్థ సెంచరీ సాధించాడు. ఇది అతనికి 34వ వన్డే అర్థసెంచరీ. రహీమ్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లున్నాయి.

బంగ్లాదేశ్ ఓపెనర్లు ఔటైనా జోరు తగ్గ లేదు. ఈ క్రమంలో షకీబ్ ఉల్ హసన్ అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. 54 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో అతను అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అర్ధసెంచరీ దిశగా సాగుతున్న ఓపెనర్ సౌమ్య సర్కార్ తృుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో సౌమ్య ఔటయ్యాడు. కేవలం 30 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో అతను 42 పరుగులు చేశాడు.

దూకుడుగా ఆడిన ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెహ్లువాయో బౌలింగ్‌లో వెనుదిరిగాడు. సౌమ్య సర్కార్‌తో కలిసి తమీమ్ తొలి వికెట్‌కు 60 పరుగులు జోడించాడు. 

ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ల మధ్య ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూసింది.. మరోవైపు సంచలన విజయం సాధించి టోర్నీని ఘనంగా ఆరంభించాలని బంగ్లాదేశ పట్టుదలతో ఆడి విజయం సాధించింది.