టీమిండియా ప్లేయర్లలో స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. ఫన్నీ టిక్ టాక్ వీడియోలతో పాటు ‘చాహాల్ టీవీ’ పేరుతో మనోడు చేసే ఇంటర్వ్యూలు, అల్లరి అంతా ఇంతా కాదు. అందుకే చాహాల్‌ అంటే చాలామందికి ఇష్టం.

సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా యజ్వేంద్ర చాహాల్... ప్రస్తుతం ఆసీస్ టూర్‌లో ఉన్నాడు.  ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు 14 రోజుల క్వారంటైన్ పీరియడ్ గడుపుతున్న చాహాల్... స్టేడియంలో సేదతీరుతున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

సిడ్నీలో ట్రైనింగ్ సెషన్ అనంతరం రిలాక్స్ అవుతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు యజ్వేంద్ర చాహాల్... ఈ ఫోటోపై ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్... ‘భాయ్ ఏంటి అంతగా ఆలోచిస్తున్నావ్’ అంటూ కామెంట్ చేశాడు. చాహాల్ లాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రషీద్ ఖాన్... తనకు నచ్చిన క్రికెటర్ల పోస్టులపై ఇలా కామెంట్లు చేస్తూ ఉంటాడు.

రషీద్ ఖాన్‌ పెట్టిన కామెంట్‌కి రిప్లై ఇచ్చిన యజ్వేంద్ర చాహాల్... ‘ఈ క్వారంటైన్ ఎప్పుడు ముగుస్తుందా... అని’ ఆలోచిస్తున్నానంటూ కామెంట్ చేశాడు.  రషీద్ ఖాన్ కామెంట్‌కి, చాహాల్ ఇచ్చిన రిప్లైకి వేలల్లో లైకులు రావడం విశేషం.

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఐపీఎల్ ఆడిన చాహాల్ 15 మ్యాచుల్లో 21 వికెట్లు తీయగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున 16 మ్యాచులు ఆడిన రషీద్ ఖాన్ 20 వికెట్లు తీశాడు. ఐపీఎల్‌లో ప్రియురాలు ధనుశ్రీవర్మతో ఎంజాయ్ చేసిన చాహాల్, ఆసీస్ టూర్‌కి కూడా ఆమెను వెంటతీసుకెళ్లాడు.