2020 సంవత్సరమే ఎన్నో కష్టాలను మోసుకొచ్చింది. కరోనా తో సహా అనేక అరిష్టాలను  వరుసబెట్టి ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంది. ప్రజలు పిట్టలు రాలినట్టు రాలుతున్నారు. ఆర్ధిక రంగం మీద కరోనా ధాటికి పడ్డ దెబ్బకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. 

ఈ పరిస్థితుల నడుమ నిన్న రియల్  మాడ్రిడ్ లాలిగా  గెలవడంతో.... రియల్ మాడ్రిడ్ ఫ్యాన్ అయిన క్రికెటర్ రోహిత్ శర్మ ఎట్టకేలకు ఈ 2020లో ఒక శుభవార్త అని అన్నాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ కామెంట్ పోస్ట్ చేసి తాను రియల్ మాడ్రిడ్ తషీర్ట్ ధరించిన ఫోటోను జత చేసాడు. 

ఈ మధ్యకాలంలో అందరికీ తెగ పంచ్ లు వేస్తున్న చాహల్ మరోమారు రోహిత్ శర్మపై అదిరిపోయే పంచ్ వేసాడు. నవ్వుతు ఉన్న రోహిత్ శర్మ ఫోటోను ఉద్దేశిస్తూ.... రోహిత్ శర్మ నవ్వడానికి అసలు కారణం ఈ రోజు ఇంటి పనుల నుండి బ్రేక్ దొరకడమే అని అన్నాడు. ఈరోజు ఇల్లు ఊడవడం, తూడవడం వంటి పనులు లేనట్టున్నాయి అని పంచ్ వేసాడు. చాహల్ పంచ్ కి నెటిజన్లు ఫిదా అయ్యారు. 

ఇకపోతే... గత నెలలో  రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ ఖేల్ రత్న అవార్డుకు నామినేట్ చేసింది బీసీసీఐ.  బీసీసీఐ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రోహిత్ శర్మను ఖేల్ రత్నకు నామినేట్ చేయడంతోపాటుగా పేస్ బౌలర్ ఇషాంత్ శర్మ, మరో ఓపెనర్ శిఖర్ ధావన్, మహిళా ఆల్ రౌండర్ దీప్తి శర్మల పేర్లను అర్జున అవార్డులకు ప్రతిపాదించింది. 

రోహిత్ శర్మ ఆటతీరును అందరి క్రికెటర్లతో బేరీజు వేసినప్పుడు అతడి అంత ప్రభావవంతంగా పరిమిత వర్ల క్రికెట్లో వేరేవారు రాణించలేదని అన్నారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. 2019 ప్రపంచ కప్ లో 5 సెంచరీలు బాదిన రోహిత్ శర్మ నూతన చరిత్రను లిఖించాడు. వేరే ఏ క్రికెటర్ కూడా సాధించలేకపోయిన ఫీట్ ను సాధించినందుకు ఆ సంవత్సరం ప్లేయర్ అఫ్ ది ఇయర్ గా కూడా నిలిచాడు.

ఇంతవరకు క్రికెట్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును అందుకున్నారు. 1998లో సచిన్ టెండూల్కర్, 2007లో ధోని, 2018లో విరాట్ కోహ్లీ లు మాత్రమే ఈ అవార్డును అందుకున్నారు. భారతదేశంలో క్రీడలకు సంబంధించిన పురస్కారాల్లో ఇది అత్యున్నతమైనది. గత సంవత్సరం ఈ అవార్డును రెజ్లర్ బజరంగ్ పూనియా దక్కించుకున్నాడు. 

ఈ మూడేళ్లలో 217 సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు కొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారం ఎత్తి దక్షిణాఫ్రికాపై విరవిహారం చేశాడు.

విశాఖ వేదికగా జరిగిన టెస్టుల్లో ఏకంగా 13 సిక్సర్లు బాదాడు. తద్వారా ఓ టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా ఆ సిరీస్‌లో అత్యధిక (20) సిక్సర్లు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ తన పేరిట మరో ఖాతాను నెలకొల్పిన విషయం తెలిసిందే.