యువరాజ్ సింగ్... టీమిండియా అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్లో దాదాపు 17ఏళ్లపాటు కొనసాగిన అతడు తాజాగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. దీంతో గత రెండేళ్లుగా జట్టుకు దూరమైన అతడిని మళ్లీ టీమిండియా జెర్సీలో చూడాలన్న అభిమానుల కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయి. ఇలా యువరాజ్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతడు టీమిండియాకు చేసిన సేవలను ఓ సారి గుర్తుచేసుకుందాం. 

అది ప్రపంచ కప్ 2011 మెగా టోర్నీ రోజులు. అప్పటికి 28ఏళ్ల క్రితం టీమిండియా కపిల్ సారథ్యంలో ఐసిసి ప్రపంచ కప్ ట్రోపీని ముద్దాడగలిగింది. ఆ తర్వాత చాలా మంది కెప్టెన్లు మారారు. ఆటగాళ్లు మారారు. ప్రపంచ కప్ టోర్నీలు కూడా ముగిసాయి. కానీ భారత జట్టు మరో ట్రోఫిని అందుకోలేకపోయింది. దీంతో టీమిండియా రెండో ప్రపంచ కప్   సాధిస్తుందన్న నమ్మకాన్ని అభిమానులు  దాదాపు కోల్పోయారు. అలాంటి సమయంలో ధోనిసేన మరో ప్రపంచ కప్ విజయాన్ని అందుకుని సంచలనం సృష్టించింది. 

ఇలా 2011 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించడంలో యువరాజ్ సింగ్ కీలకపాత్ర పోషించాడు.  ఈ టోర్నీలో 362 పరుగులు, 15 వికెట్లతో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి భారత్ కు రెండో ప్రపంచ కప్ అందించాడు. ఇలా అద్భుతమైన ఆటతీరుతో యువరాజ్ ప్రపంచ కప్ ట్రోపీని భారత జట్టుకు అందించగా.... నాలుగు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లతో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. 

అయితే ఈ  ప్రపంచ కప్ మధ్యలోనే యువరాజ్ క్యాన్సర్ భయపడిందట. ఈ విషయాన్ని అతడికి తెలిపిన డాక్టర్లు వెంటనే చికిత్స అవసరమని కూడా సూచించారట. కానీ  యువరాజ్ మాత్రం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రపంచ కప్ టోర్నీ మొత్తం ముగిసే వరకు జట్టులోనే వున్నాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో తన సేవలు జట్టుకు ఎంతో అవసరమని భావించిన యువరాజ్ తన ప్రాణాలను పనంగా పెట్టి టీమిండియాకు వరల్డ్ కప్ అందించాడని అతడి సన్నిహితులు అప్పట్లో తెలిపారు.  

ఇలా యువరాజ్ 2011 వరల్డ్ ముగిసిన వెంటనే తాను క్యాన్సర్ తో బాధపడుతున్న విషయాన్ని బయటపెట్టాడు. ప్రమాదకర స్థాయిలో వున్న ఆ జబ్బును తన ఆత్మవిశ్వాసంతో జయించి  మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసి యువరాజ్ ప్రశంసలు పొందాడు.