టీమిండియా మరో కీలక ఆటగాడి సేవలను పూర్తిగా కోల్పోయింది. అంతర్జాతీయ క్రికెట్లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న యువరాజ్ సింగ్ ఇవాళ (సోమవారం)రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుండి తాను తప్పకుంటున్నట్లు యువీ తెలియజేశాడు. అంతేకాకుండా తాను ఫామ్ లేమితో బాధపడుతున్న సమయంలో తనను ఎవరెలా అవమానించారో గుర్తుచేసుకుని యువరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. 

ముఖ్యంగా యువీ 2017 లో జరిగిన యో యో టెస్ట్ వివాదం గురించి మాట్లాడాడు. ఈ టెస్ట్ కు ముందే తనతో కొందరు అధికారులు చర్చలు జరిపినట్లు యువీ తెలిపాడు. అయితే వారు తనను నేరుగా రిటైర్మెంట్ ప్రకటించమని చెప్పకుండా యో యో పరీక్ష వంకతో ఆ విషయాన్ని ప్రస్తావించారన్నాడు. ఈ పిట్ నెస్ పరీక్షలో ఒకవేళ తాను ఫెయిల్ అయితే  ఒక  ఫెయిర్ వెల్ మ్యాచ్ ఆడే అవకాశమిస్తామని తెలిపారు. అయితే అందుకు తాను తిరస్కరించానని యువీ సంచలన విషయాలు బయటపెట్టాడు. 

అయితే ఈ వ్యవహారంతో సంబంధాలున్నవారి పేర్లను తాను ఇప్పుడే బయటపెట్టాలని అనుకోవడం లేదన్నాడు. ప్రస్తుతానికి తాను క్రికెట్ వ్యవహారాలకు దూరంగా కాస్త ప్రశాతం జీవితాన్ని  గడపాలనుకుంటున్నానని తెలిపాడు. అంతేకాకుండా టీమిండియా ప్రపంచ కప్ ఆడుతున్న నేపథ్యంలో ఎలాంటి వివాదాన్ని సృష్టించరాదని అనుకుంటున్నానని తెలిపాడు.  అయితే సమయం వచ్చినపుడు ఈ విషయాలన్నింటిపై మాట్లాడతానని....అందుకు ఇంకా చాలా సమయం వుందని యువీ పేర్కొన్నాడు.  

యువరాజ్ ముంబై వాంఖడే స్టేడియానికి సమీపంలోని ఓ హోటల్లో  విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి తన రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. ఈ సమావేశంలో అతడి తల్లి, భార్యతో పాటు మరికొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యువీ కాస్త భావోద్వేగంగా మాట్లాడాడు.