Zim Afra T10 League: 26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 80 పరుగులు చేసిన యూసఫ్ పఠాన్...  36 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 88 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప... 

ఐపీఎల్‌లో అదరగొట్టినా టీమిండియా తరుపున పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయారు యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప వంటి క్రికెటర్లు. 2007 టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమ్‌లో సభ్యులుగా ఉన్న ఈ ఇద్దరూ... ప్రస్తుతం జిమ్ ఆఫ్రో టీ10 లీగ్‌లో పాల్గొంటున్నారు. 10 ఓవర్ల ఫార్మాట్‌లో జరిగే ఈ లీగ్‌లో భారత క్రికెటర్లు దుమ్మురేపారు..

జిమ్ ఆఫ్రో టీ10 క్వాలిఫైయర్స్‌లో దర్భన్ ఖలందర్స్‌, తొలి బ్యాటింగ్ చేసి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. 141 పరుగుల భారీ లక్ష్యఛేదనలో మహ్మద్ హఫీజ్ 17, టామ్ బంటన్ 4, విల్ సమీద్ 16 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రవి బొపారా 1 పరుగుకే అవుట్ అయ్యాడు. 5.1 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది జోబర్గ్ బఫెల్లోస్... అయితే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన యూసఫ్ పఠాన్, 26 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

యూసఫ్ పఠాన్ సునామీ ఇన్నింగ్స్‌కి 9.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది జోబర్గ్ బఫెల్లోస్... 7 ఓవర్లు ముగిసే సమయానికి 77 పరుగులే చేసింది జోబర్గ్ బఫెల్లోస్ టీమ్. అయితే పాక్ మాజీ పేసర్ మహ్మద్ అమీర్ వేసిన 8వ ఓవర్‌లో 6, 6, 0, 6, 2, 4 బాదిన యూసఫ్ పఠాన్, ఆ తర్వాత బ్రాడ్ ఎవన్స్‌ వేసిన 9 ఓవర్‌లో 6, 6, 4 బాదాడు. టెండై ఛతరా వేసిన ఆఖరి ఓవర్‌లో వరుసగా 6,4, 6, 4 బాది మ్యాచ్‌ని ముగించేశాడు యూసఫ్ పఠాన్. 

 ఇదే లీగ్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేప్‌ టౌన్ సాంప్ ఆర్మీ, నిర్ణీత 10 ఓవర్లలో 145 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ ప్లేయర్ రెహ్మనుల్లా గుర్భాన్ 26 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. 

ఈ మ్యాచ్‌లో హరారే హర్రికేన్స్‌ తరుపున ఆడిన భారత మాజీ బౌలర్ శ్రీశాంత్, 2 ఓవర్లు బౌలింగ్ చేసి 39 పరుగులు సమర్పించాడు. ఈ లక్ష్యాన్ని 9.2 ఓవర్లలోనే ఛేదించింది హరారే హర్రికేన్స్. హరారే కెప్టెన్ రాబిన్ ఊతప్ప 36 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 88 పరుగులు చేసి హరికేన్స్‌కి ఘన విజయాన్ని అందించాడు.. 

ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన హరారే హరికేన్స్, దర్భన్ ఖలందర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో 4 వికెట్ల తేడాతో ఓడింది. జూలై 29న జోబర్గ్ బఫెల్లోస్, దర్భన్ ఖలందర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది..