చిన్నారి ఇచ్చిన బ్రాస్‌లెట్‌ని ధరించిన విరాట్ కోహ్లీ... ఫేవరెట్ క్రికెటర్ కోసం ప్రత్యేకంగా తయారుచేసి...
విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్రాస్‌లెట్‌ని బహుమతిగా ఇచ్చిన చిన్నారి... ఆమె ముందే దాన్ని ధరించి, ఫోటోలకు ఫోజిచ్చిన విరాట్ కోహ్లీ..
భారతీయులను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్స్ సినిమా, క్రికెట్. ఏ ఖండంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఈ రెండూ ఉండాల్సిందే. అందుకే భారత క్రికెట్ జట్టు, ఏ దేశ పర్యటనకి వెళ్లిన టీమిండియా ఫ్యాన్స్ సందడి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వెస్టిండీస్ టూర్‌లో వన్డే సిరీస్ ఆడుతున్న భారత జట్టుని చూసేందుకు, తమ ఫేవరెట్ క్రికెటర్లతో ఫోటోలు దిగేందుకు ఆ దేశంలో ఉన్న భారతీయులు వందల కిలో మీటర్లు ప్రయాణం చేసి వస్తున్నారు...
తాజాగా బార్బోడాస్‌లో జరిగిన రెండో వన్డే సమయంలో ఓ చిన్నారి, విరాట్ కోహ్లీ కోసం ప్రత్యేకంగా తయారుచేసిన బ్రేస్‌లెట్‌ని అతనికి అందించాడు. తన కోసం ప్రత్యేకంగా చేసిన ఆ బ్రాస్‌లెట్‌ని తీసుకున్న విరాట్ కోహ్లీ, చేతికి ధరించి... తన బుల్లి అభిమానిని హ్యాపీ చేశాడు. ఆ తర్వాత ఆమెతో, తన కుటుంబంతో ఫోటో దిగాడు..
ఈ క్యూట్ మూమెంట్స్‌కి సంబంధించిన వీడియోను బీసీసీఐ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ‘నేను మీ కోసం ఈ గిఫ్ట్ చేశాను..’ అంటూ చిన్నారి అంటే... ‘ఓ రియల్లీ...’ అంటూ దాన్ని తీసుకుని,తన చేతికి పెట్టుకున్నాడు విరాట్ కోహ్లీ.
‘మాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా కుటుంబంలో అందరూ క్రికెట్ లవర్సే. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు కుటంబమంతా తిరిగి ఇక్కడే కలిశాం. ఇది మాకు ఫ్యామిలీ రీయూనియన్. ఇక్కడ చాలా గొప్పగా గడిచింది. విరాట్ కోసం మా అమ్మాయి, ఎంతో ఇష్టంగా బ్రాస్‌లెట్ చేసింది. దాన్ని అతను తీసుకుంటాడా? లేదా? అనే ఎన్నో అనుమానాలు కలిగాయి.
కానీ విరాట్ కోహ్లీ తీసుకుని, బాగుందని చెప్పగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయి. విరాట్ కోహ్లీ మా ముందే బ్రాస్‌లెట్ వేసుకుని, మాతో ఫోటోలు దిగాడు. తన జీవితంలో ఈ మూమెంట్స్‌ని ఎప్పటికీ మరిచిపోలేదు... వరల్డ్ సూపర్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇంత ఒదిగి ఉంటాడని అస్సలు అనుకోలేదు..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆ అమ్మాయి తండ్రి...
రెండో మ్యాచ్ చూసేందుకు బార్బోడాస్‌కి వచ్చిన అభిమానులకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆటోగ్రాఫ్‌లు, ఫోటోగ్రాఫ్‌లు ఇచ్చారు..
మొదటి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలిచిన వెస్టిండీస్, సిరీస్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్ 2న ట్రినిడాడ్‌లో జరిగే ఆఖరి వన్డేలో సిరీస్ ఫలితం తేలనుంది. రెండు వన్డేల్లో బరిలో దిగని విరాట్ కోహ్లీ, మూడో వన్డేలో ఆడే అవకాశం ఉంది. ఆ తర్వాత శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ జరుగుతుంది..