క్రికెట్ అంటే అతడికి ప్రాాణం. చిన్నప్పటి నుండి గొప్ప క్రికెటర్ గా ఎదగాలని కలలు కనేవాడు. కేవలం కలలే కాదు  అందుకోసం కఠోరంగా శ్రమించేవాడు. ఇలా క్రికెటర్ గా రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తూ తన కలలకు దగ్గరవుతున్న సమయంలో అతడిని విధి వంచించింది. తోటి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టిస్ సెషన్లో పాల్గొంటూ మైదానంలోనే ఒక్కసారిగా కుప్పకూలి   ఈ యువ క్రికకెటర్ ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన పశ్చిమబెంగాల్ లో చోటుచేసుకుంది. 

పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా‌ నివాసి సోనూ యాదవ్ ప్రొపెషనల్ క్రికెటర్. ఇతడు సెంకడరీ డివిజన్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అంతే కాకుండా స్థానిక బల్లిగుంగే స్పోర్ట్స్ క్లబ్ తరపున క్రికెట్ మ్యాచులు ఆడేవాడు. ఇలా ఇప్పుడిప్పుడే క్రికెటర్ గా నిరూపించుకోడానికి అతడికి మంచి అవకాశాలు లభించాయి. ఇలా ఎదుగుతున్న సమయంలోనే అతడిని అనారోగ్యం కాటేసింది. 

బుధవారం మధ్యాహ్నం తోటి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సోను హటాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. దీని కారణంగా మైదానంలోనే నీరసంతో కుప్పకూలాడు.  దీంతో తోటి ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది అతడికి క్రికెట్ అసోసియేషన్ ఆప్ బెంగాల్ మెడికల్ యూనిట్ కు తరలించారు. అక్కడి మెడికల్ సిబ్బంది ప్రథమ చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు.   

అక్కడ డాక్టర్లు మెరుగైన చికిత్స అందించినా సోను ప్రాణాలను కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ అతడు తుదిశ్వాస విడిచినట్లు డాక్టర్లు ప్రకటించారు. అయితే మరణానికి గల కారణాలు తెలియలేదని, పోస్టు మార్టం అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని వారు వెల్లడించారు.