Sachin Tendulkar Hails Mithali Raj: భారత మహిళా క్రికెట్ కు కర్త, కర్మ, క్రియగా నిలిచిన మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పై టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. 

23 ఏండ్ల సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కుని దేశంలో మహిళా క్రికెటర్లకు స్పూర్తిగా నిలిచిన టీమిండియా వుమెన్స్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ పై భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తో పాటు సౌరవ్ గంగూలీలు ప్రశంసలు కురిపించారు. మిథాలీ దేశంలో లక్షలాది మందికి స్పూర్తినిచ్చిందని సచిన్ కొనియాడాడు. మిథాలీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ‘శభాష్ మిథు’ ట్రైలర్ విడుదలైన సందర్భంగా సచిన్, గంగూలీలు ట్విటర్ వేదికగా స్పందించారు. 

ట్రైలర్ విడుదలైన సందర్భంగా సచిన్ ట్విటర్ లో స్పందిస్తూ.. ‘శభాష్ మిథు ట్రైలర్ హృదయానికి హత్తుకునేలా ఉంది. మిథాలీ దేశంలో లక్షలాది మందికి స్పూర్తిగా నిలిచింది. ఈ సినిమా చూడటానికి నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా.. ఈ చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు..’ అని రాసుకొచ్చాడు. 

అంతకుముందు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. #GirlWhoChangedGame అనే హ్యాష్ ట్యాగ్ తో శభాష్ మిథు ట్రైలర్ ను అభిమానులతో పంచుకున్నాడు. చిత్ర బృందానికి గంగూలీ బెస్ట్ విషెస్ తెలిపాడు. సోమవారం విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. తాప్సీగా మిథాలీ ఆకట్టుకుందని అభిమానులు అంటున్నారు. గతంలో పలు మహిళా ప్రధాన చిత్రాల్లో నటించిన తాప్సీ.. మిథాలీ బయోపిక్ లో తన ప్రాణం పెట్టి నటించిందని కామెంట్స్ చేస్తున్నారు. 

Scroll to load tweet…

కాగా మిథాలీ రాజ్ జీవితాన్ని ఆధారంగా తీసుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘శభాష్ మిథు’. బాలీవుడ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర బృందం సోమవారం విడుదల చేసింది. స్వయంగా మిథాలీ రాజ్.. తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ ట్రైలర్ ను అభిమానులతో పంచుకుంది. చిన్నతనం నుంచే క్రికెటర్ కావాలని కలలు కన్న మిథాలీ.. ఆ క్రమంలో ఆమె ఎదుర్కున్న అవమానాలు.. ఆటలో ఎత్తు పల్లాలు.. ఇతరత్రా ఆమె కెరీర్ కు సంబంధించిన విషయాలతో ట్రైలర్ ను ఆసక్తికరంగా మలిచారు దర్శక నిర్మాతలు. మిథాలీ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేస్తూ.. ‘ఒక ఆట.. ఒక దేశం.. ఒక ఆశయం.. నా కల! ఈ బృందానికి కృతజ్ఞతలు, నా కథను మీతో పంచుకుంటున్నందుకు సంతోషంగా ఉంది..’ అని ఇన్స్టాలో రాసుకొచ్చింది. 

View post on Instagram

ట్రైలర్ లో మిథాలీ.. ‘మెన్ ఇన్ బ్లూ తరహా మనకు కూడా ఓ టీమ్ ఉంటే బాగుంటుంది.. ఉమెన్ ఇన్ బ్లూ..’ అని తాప్సీ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మిథాలీ చిన్నతనంలో ఎదుర్కున్న అనుభవాలు, భారత క్రికెట్ లోకి వచ్చాక ఆమె చూపిన తెగువ.. వంటివి ప్రేక్షకులను హత్తుకునేలా రూపొందించారు. ఇక మిథాలీగా తాప్సీ అదరగొట్టింది. వయాకామ్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే నెల 15న విడుదల కానుంది.