విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 4 పరుగుల దూరంలో టీమిండియా... రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టాపోకుండా 146 పరుగులు చేసిన టీమిండియా..
డొమినికా టెస్టులో టీమిండియా ఆధిక్యం కొనసాగుతోంది. వెస్టిండీస్‌ని 150 పరుగులకి ఆలౌట్ చేసిన భారత జట్టు, రెండో రోజు లంచ్ బ్రేక్ సమయానికి వికెట్ నష్టపోకుండా 146 పరుగులు చేసింది. విండీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 4 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది భారత జట్టు..
చేతిలో 10 వికెట్లు ఉండడం, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్, అజింకా రహానే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటి బ్యాటర్లు ఇంకా బ్యాటింగ్‌కి రావాల్సి ఉండడంతో భారత జట్టు, ఇలాగే బ్యాటింగ్ చేస్తే మరో నాలుగైదు సెషన్ల పాటు ఇన్నింగ్స్ సాగడం గ్యారెంటీ. ఓవర్‌నైట్ స్కోరు 80/0 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, రెండో రోజు తొలి సెషన్‌లో 32 ఓవర్లలో 66 పరుగులు జోడించారు.
104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 167 బంతుల్లో 7 ఫోర్లతో 62 పరుగులు చేయగా 163 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన రోహిత్ శర్మ క్రీజులో ఉన్నారు...
ఆరంగ్రేటం టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన రెండో భారత లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు 2013లో ఆస్ట్రేలియాపై టెస్టు ఆరంగ్రేటం చేసిన శిఖర్ ధావన్, ఆరంగ్రేటం టెస్టులో 187 పరుగులు చేసి రికార్డు నెలకొల్పాడు..
17 ఏళ్ల తర్వాత వెస్టిండీస్ పర్యటనలో తొలి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నెలకొల్పింది టీమిండియా. 2006 పర్యటనలో వీరేంద్ర సెహ్వాగ్, వసీం జాఫర్ కలిసి తొలి వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ రికార్డు బ్రేక్ చేయడానికి యశస్వి, రోహిత్ జోడీ ఇంకా 14 పరుగులు జోడిస్తే చాలు.
అల్జెరీ జోసఫ్ వేసిన ఇన్నింగ్స్ 37వ ఓవర్‌లో ఓ సిక్స్, ఫోర్ బాదిన రోహిత్ శర్మ, 106 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ టెస్టు కెరీర్‌లో ఇది 15వ హాఫ్ సెంచరీ. హాఫ్ సెంచరీల తర్వాత రోహిత్, యశస్వి ఇద్దరూ కూడా వికెట్ కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో బౌండరీలు ఎక్కువగా రాలేదు.
రోహిత్ శర్మ టెస్టుల్లో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్‌గా టెస్టుల్లో అత్యధిక యావరేజ్ కలిగిన భారత బ్యాటర్‌గా టాప్‌లో నిలిచాడు రోహిత్ శర్మ.
