తొలి టీ20లో టీమిండియా బోణీ... 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. వర్షం అంతరాయంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం గెలిచిన టీమిండియా..
ఐర్లాండ్ పర్యటనలో జరుగుతున్న తొలి టీ20కి వరుణుడి అంతరాయంతో ముగిసింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి 6.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 47 పరుగులు చేసిన భారత జట్టు, డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది టీమిండియా... 140 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియాకి శుభారంభమే దక్కింది. రెండో ఓవర్ మూడో బంతికి రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు ఇద్దరు ఓపెనర్లు. పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 45 పరుగులు చేసింది టీమిండియా..
23 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 24 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, క్రెగ్ యంగ్ బౌలింగ్‌లో పాల్ స్టిర్లింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాతి బంతికే తిలక్ వర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. వైడ్‌గా వెళ్తున్న బంతిని ఆడబోయిన తిలక్ వర్మ, కీపర్ టక్కర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. రుతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.
సంజూ శాంసన్ వచ్చి సింగిల్ తీయగానే వర్షం పెరగడంతో మ్యాచ్‌ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంపైర్లు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 2 పరుగుల తేడాతో టీమిండియాకి విజయం దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగుల స్కోరు చేయగలిగింది. ఐర్లాండ్ బ్యాటర్ బారీ మెక్‌కార్తీ అద్భుత హాఫ్ సెంచరీతో ఐర్లాండ్ ఈ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రీఎంట్రీలో జస్ప్రిత్ బుమ్రా వేసిన మొదటి ఓవర్‌లోనే బాల్బరీన్, లోర్కన్ టక్కర్ అవుట్ చేశాడు.
రీఎంట్రీ తర్వాత వేసిన మొదటి ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు జస్ప్రిత్ బుమ్రా. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన హారీ టెక్టర్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన ఐర్లాండ్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్‌ని రవి భిష్ణోయ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 3 బంతుల్లో 1 పరుగు చేసిన జార్జ్ డాక్‌రెల్ కూడా ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.. 31 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఐర్లాండ్..
ఈ దశలో మార్క్ అదైర్, కర్టీస్ కాంపర్ కలిసి ఆరో వికెట్‌కి 24 బంతుల్లో 28 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 16 బంతుల్లో 2 ఫోర్లతో 16 పరుగులు చేసిన మార్క్ అదైర్, రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఏడో వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత కర్టీస్ కాంపర్‌ని అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేశాడు. 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 39 పరుగులు చేసిన కర్టీస్ కాంపర్, క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 4, 2, 6, 6 బాదిన బారీ మెక్‌కార్తీ... టీ20ల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్నాడు.
