యూఏఈతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకున్న భారత జట్టు... నితీశ్ రాణాకి 4 వికెట్లు, సెంచరీతో చెలరేగిన కెప్టెన్ యశ్ ధుల్.. 

కొలంబోలో జరుగుతున్న ఎమర్జింగ్ మెన్స్ ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి మ్యాచ్‌లో అదిరిపోయే బోణీ కొట్టింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి... 8 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది..

టాస్ గెలిచిన టీమిండియా, యూఏఈకి బ్యాటింగ్ అప్పగించింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 175 పరుగుల స్కోరు మాత్రమే చేయగలిగింది. జొనాథన్ ఫిగీ‌ని డకౌట్ చేసిన హర్షిత్ రాణా, 5 పరుగులు చేసిన అన్స‌ టంగన్‌ని పెవిలియన్ చేర్చాడు.

10 బంతులు ఆడి 2 పరుగులు చేసిన లవ్‌ప్రీత్ సింగ్‌ని ఆకాశ్ సింగ్ అవుట్ చేశాడు. 42 బంతుల్లో 7 ఫోర్లతో 38 పరుగులు చేసిన ఆర్యాంశ్ శర్మ, మనవ్ సుథార్ బౌలింగ్‌లో అవుట్ కాగా 107 బంతులు ఆడిన కెప్టెన్ వాల్తప్ప చిందబరం ఒక్క బౌండరీ కూడా లేకుండా 46 పరుగులు చేసి నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..

అలీ నజీర్ 10, మహ్మద్ ఫరాజుద్దీన్ 88 బంతుల్లో 2 ఫోర్లతో 35 పరుగులు, సచింత్ శర్మ 2, జష్ గియనని 13 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆదిత్య శెట్టి 2, జవాదుల్లా 9 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణాకి 4 వికెట్లు దక్కగా నితీశ్ రెడ్డి, మనవ్ సుతర్ రెండేసి వికెట్లు తీశారు. ఆకాశ్ సింగ్‌కి ఓ వికెట్ దక్కింది..

176 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో సాయి సుదర్శన్ 8 బంతుల్లో 2 ఫోర్లతో 8 పరుగులు చేసి అవుట్ కాగా అభిషేక్ శర్మ 14 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 41 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా. ఈ దశలో నికిత్ జోష్, కెప్టెన్ యష్ ధుల్ కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 138 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి, టీమిండియాకి విజయాన్ని అందించారు..

నికిన్ జోష్ 53 బంతుల్లో 5 ఫోర్లతో 41 పరుగులు చేయగా 84 బంతుల్లో 20 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 108 పరుగులు చేసి.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు యశ్ ధుల్. 26.3 ఓవర్లలోనే మ్యాచ్‌ని ముగించిన టీమిండియా, తర్వాతి మ్యాచ్‌లో నేపాల్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌ జూలై 17న జరుగుతుంది.

Scroll to load tweet…

జూలై 19న పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడే టీమిండియా, ఈ రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా సెమీ ఫైనల్‌కి చేరుతుంది. యష్ ధుల్ కెప్టెన్సీలో అండర్19 వన్డే వరల్డ్ కప్ 2022 గెలిచిన టీమిండియా, అండర్-19 ఆసియా కప్ టైటిల్ కూడా గెలిచింది.