WTC Finals 2023: జూన్ 7 నుంచి 12 వరకు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ జరుగనుంది.
రెండేండ్లకోమారు జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్స్ కు ఇప్పటికే అర్హత సాధించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ).. ఆ మేరకు ఓవల్ లో ఐసీసీ ట్రోఫీ నెగ్గేందుకు గెలుపు గుర్రాలను ఎంపిక చేసింది. టీమిండియాతో జూన్ 7 నుంచి 12 వరకు ఇంగ్లాండ్ లోని ‘ది ఓవల్’ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరుగనున్న నేపథ్యంలో సీఏ కీలక ప్రకటన చేసింది. డబ్ల్యూటీసీ ఫైనల్స్ తో పాటు అది ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ తో జరుగబోయే యాషెస్ సిరీస్ లో రెండు టెస్టులకు గాను 17 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ తో రెండు టెస్టులు ఆడి ఆ తర్వాత తన తల్లికి అనారోగ్యంగా ఉండటంతో తిరిగి ఆసీస్ కు వెళ్లి అక్కడే ఉన్న ఆ జట్టు సారథి పాట్ కమిన్స్.. తిరిగి జట్టుతో కలవనున్నాడు. గత కొంతకాలంగా టెస్టులలో ఫామ్ లేమితో తంటాలు పడుతున్న డేవిడ్ వార్నర్ కు ఈ ఫార్మాట్ లో లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.
2021 నుంచి డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ దారుణంగా సాగుతోంది. గడిచిన రెండేండ్లుగా అతడు పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. కానీ కొద్దిరోజుల క్రితం దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టెస్టులో డబుల్ సెంచరీ చేసి తిరిగి ఫామ్ అందుకున్నట్టే కనిపించిన ఈ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి.. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టులు ఆడి దారుణంగా విఫలమయ్యాడు. దీంతో ఇక వార్నర్ భాయ్ కెరీర్ ముగిసినట్టేనని అంతా భావించారు. కానీ గాయం నుంచి కోలుకున్న వార్నర్.. ఐపీఎల్ లో నిలకడగా రాణిస్తుండటంతో సెలక్టర్లు అతడికి మరో ఛాన్స్ ఇచ్చారు.
వార్నర్ తో పాటు ఢిల్లీ జట్టులో ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ కూడా నాలుగేండ్ల తర్వాత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం గమనార్హం. వీరే గాక మార్కస్ హరిస్, జోష్ ఇంగ్లిష్ లు కూడా టెస్టు జట్టులోకి తిరిగొచ్చారు. మిగిలినవారిలో చాలామంది భారత పర్యటనకు వచ్చినవారే ఉన్నారు. స్టార్ బ్యాటర్లు, నలుగురు పేసర్లు, ముగ్గురు పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్టు స్నిన్నర్లతో కూడిన ఆసీస్ జట్టు పటిష్టంగా ఉంది. వీరిలోంచి డబ్ల్యూటీసీ ఫైనల్ కు ఆడబోయే 15 మంది పేర్లను మే 28న ప్రకటించనున్నారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ తో పాటు యాషెస్ తో రెండు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు : పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్ కేరీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హరీస్, జోష్ హెజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిష్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, డేవిడ్ వార్నర్
ఇంగ్లాండ్ - ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ షెడ్యూల్ :
1. జూన్ 16 - 20 : మొదటి టెస్టు - బర్మింగ్‌హామ్
2. జూన్ 28 - జులై 02 : రెండో టెస్లు - లార్డ్స్ (లండన్)
3. జులై 06 - 10 : మూడో టెస్టు - లీడ్స్
4. జులై 19 - 23 : నాలుగో టెస్టు - మాంచెస్టర్
5. జులై 27 - 31 : ఐదో టెస్టు - ది ఓవల్ (లండన్)
