సారాంశం
WTC Final 2023: టీమిండియా సారథి రోహిత్ శర్మ నేడు తన కెరీర్ లోనే అత్యంత కఠినమైన సవాల్ ను ఎదుర్కోబోతున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత జట్టును నడిపించబోతున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని తర్వాత టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ.. జట్టును బాగానే నడిపించినా ఐసీసీ ట్రోఫీని మాత్రం అందించలేకపోయాడు. దీంతో 2021లో అతడు టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా బీసీసీఐ అతడిని వన్డే ఫార్మాట్ నుంచి కూడా తొలగించి రోహిత్ ను కెప్టెన్ గా నియమించింది. ధోని తర్వాత కూల్ కెప్టెన్ గా పేరొందిన రోహిత్ జట్టు సహచర సభ్యులతో కూడా జోవియల్ గా ఉంటాడు. తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్స్ ముందు ఐసీసీ విడుదల చేసిన ఓ వీడియో లో కూడా టీమిండియా క్రికెటర్లు అతడి గురించి కింది విధంగా స్పందించారు.
ఐసీసీ విడుదల చేసిన ఈ వీడియోలో పుజారా, సిరాజ్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్, శుభ్‌మన్ గిల్ లను ‘రోహిత్ గురించి వన్ వర్డ్ లో చెప్పండి’ అని క్వశ్చన్ అడిగారు. వీళ్లంతా కెప్టెన్ గురించి ఏం చెప్పారంటే...
టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీతో పాటు యువ సంచలనం శుభ్‌మన్ గిల్ లు రోహిత్ ను ‘హిట్‌మ్యాన్’అని అన్నారు. కెఎస్ భరత్.. ‘రిలాక్స్డ్’ అని బదులివ్వగా సిరాజ్ ‘పుల్లర్’ అని చెప్పాడు. టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రోహిత్ ను ‘క్లాస్’గా అభివర్ణించాడు.
వీళ్లంతా వన్ వర్డ్ ఆన్సర్ చెప్పగా టీమిండియా నయా వాల్ ఛటేశ్వర్ పుజారా మాత్రం కాస్త వివరంగా చెప్పాడు. ‘రోహిత్ చాలా టాలెంటెడ్ ప్లేయర్. ఆటగాడిగానే కాకుండా సారథిగా కూడా మంచి నైపుణ్యం కలవాడు. ఎంత ఒత్తిడి ఎదురైనా చాలా కామ్ గా ఉంటాడు..’ అని చెప్పుకొచ్చాడు. ఇక రోహిత్ స్నేహితుడు శార్దూల్ ఠాకూర్ స్పందిస్తూ.. ‘ముంబై లాంగ్వేజ్ లో మేం అతడిని ‘బంటా హై’ అంటాం. అతడు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. మనం ఖాళీగా ఉంటే వెనకనుంచి వచ్చి తల మీద కొట్టి నవ్వి వెళ్లిపోతాడు. నాకు అతడు చిన్నప్పట్నుంచీ తెలుసు. అప్పట్నుంచి ఇప్పటిదాకా హిట్‌మ్యాన్ ఏ మాత్రం మారలేదు..’అని తెలిపాడు.
టీమిండియా క్రికెటర్లు రోహిత్ గురించి వన్ వర్డ్ లో చెప్పిన వీడియో ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అయింది.