Asianet News TeluguAsianet News Telugu

యూపీ సంచలనం.. ముంబై జైత్రయాత్రకు బ్రేక్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి ఓటమి..

WPL: వరుసగా ఐదు మ్యాచ్ లలో గెలిచి  జోరుమీదున్న ముంబై ఇండియన్స్ కు యూపీ వారియర్స్  ఊహించని షాకిచ్చింది. ఈ టోర్నీలో ముంబైకి తొలిసారి ఓటమి రుచి చూపించింది. 

WPL 2023: UP Warriorz Shocks Mumbai Indians, Beats MI by 5 Wickets MSV
Author
First Published Mar 18, 2023, 6:53 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  వరుస విజయాలతో  జైత్రయాత్ర సాగిస్తున్న ముంబై ఇండియన్స్ కు  లీగ్ లో తొలి ఓటమి ఎదురైంది. యూపీ వారియర్స్ జట్టు.. హర్మన్‌ప్రీత్ సేనకు ఈ సీజన్ లో తొలి ఓటమిని పరిచయం చేసింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ చేరామన్న  అత్యుత్సాహమో లేక మరే కారణమో గానీ ముంబై అన్ని విభాగాల్లోనూ విఫలమై తొలి ఓటమిని చవిచూసింది.   తొలుత యూపీ  బౌలర్లు ముంబైని  127 పరుగులకే కట్టడి చేయగా  తర్వాత  ఆ జట్టు బ్యాటర్లు గ్రేస్ హరీస్, తహిలా మెక్‌గ్రాత్  ల విజృంభణతో  19.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుని ప్లేఆఫ్  బెర్త్ కు మరింత దగ్గరైంది.  కాగా ముంబై ఓటమితో ఈ లీగ్ లో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించినట్టే..! 

ఈజీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో  యూపీ రెండో ఓవర్లోనే ఓపెనర్ దేవికా వైద్య (1) వికెట్ ను కోల్పోయింది. కెప్టెన్ అలీస్సా హేలీ  (8) ను ఇస్సీ వాంగ్ ఎల్బీగా వెనక్కి పంపింది.  మాథ్యూస్ వేసిన  నాలుగో ఓవర్లో ఓ  సిక్సర్ కొట్టిన కిరణ్ నవ్‌గిరె (12) కూడా  నటాలీ సీవర్ వేసిన  ఏడో ఓవర్లో  కీపర్ యస్తికాకు చిక్కింది.  

27కే 3 కీలక వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో  తహిలా మెక్‌గ్రాత్  (25 బంతుల్లో  38,  6 ఫోర్లు, 1 సిక్స్) యూపీని ఆదుకుంది. గ్రేస్ హరీస్ (28 బంతుల్లో 39, 7 ఫోర్లు) తో కలిసి  నాలుగో వికెట్ కు ఆమె  46 పరుగులు జోడించింది. సైకా ఇషాక్ వేసిన 11వ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన  మెక్‌గ్రాత్.. అమెలియా కెర్ వేసిన 12వ ఓవర్లో  ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.  అప్పిటికీ 12 ఓవర్లలో యూపీ స్కోరు 4 వికెట్ల నష్టానికి  72 పరుగులు. 

మెక్‌గ్రాత్ నిష్క్రమించినా   దీప్తి శర్మ (13 నాటౌట్) తో కలిసి హరీస్ యూపీ విజయానికి దగ్గరచేసింది.  నటాలీ సీవర్  వేసిన 13వ ఓవర్లో రెండు ఫోర్లు బాదింది. అదే ఊపులో అమన్‌జ్యోత్ కౌర్ వేసిన  15వ ఓవర్లో మరో రెండు ఫోర్లు కొట్టింది. తర్వాత ఓవర్ వేసిన  అమెలియా కెర్ బౌలింగ్ లోనూ రెండు బౌండరీలు సాధించినా అదే ఓవర్లో  నాలుగో బంతికి భారీ షాట్ ఆడివ వాంగ్ చేతికి చిక్కింది. అయితే అప్పటికీ యూపీ  విజయానికి  26 బంతుల్లో 23 పరుగులు మాత్రమే కావాల్సి ఉంది. మిగిలిన లాంఛనాన్ని దీప్తి శర్మ, ఎకిల్‌స్టోన్ (16 నాటౌట్) పూర్తి చేశారు. 

కెర్ వేసిన 18వ ఓవర్లో  తొలి బంతికి  ఎకిల్‌స్టోన్ ఫోర్ కొట్టింది.   మాథ్యూస్  వేసిన  19వ ఓవర్లో నాలుగో బంతికి దీప్తి కూడా ఫోర్ కొట్టింది.  చివరి ఓవర్లో   ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హర్మన్.. ఇస్సీ వాంగ్ కు బంతినిచ్చింది. ఈ ఓవర్లో  తొలి, రెండో బంతికి పరుగులు రాలేదు. కానీ మూడో బంతికి ఎకిల్‌స్టోన్ భారీ సిక్సర్ బాదడంతో యూపీ విజయం ఖాయమైంది. 

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. నిర్ణీత  20 ఓవర్లలో   127   పరుగులకే ఆలౌట్ అయింది.  ఆ జట్టులో మాథ్యూస్ (35),. ఇస్సీ వాంగ్  (32), హర్మన్‌‌‌ప్రీత్ కౌర్ (25)లు మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లలో ఒక్కరు కూడా  రెండంకెల స్కోరు చేయలేదు. యూపీ బౌలర్లలో ఎకిల్‌స్టోన్ 3 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios