Asianet News TeluguAsianet News Telugu

ముంబైకి యూపీ షాక్.. వారియర్స్‌కు సూపర్ ఛాన్స్..

WPL: వరుస విజయాలతో దూసుకుపోతూ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  జైత్రయాత్ర సాగిస్తున్న ముంబై ఇండియన్స్  కు యూపీ వారియర్స్ షాకిచ్చింది.  పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న  ముంబైని తక్కువ స్కోరుకే కట్టడి చేసింది.  
 

WPL 2023: UP Warriorz Restrict Mumbai Indians at  127, Chance To Beat MI in First Time in The League MSV
Author
First Published Mar 18, 2023, 5:05 PM IST

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న  ముంబై ఇండియన్స్ కు  యూపీ వారియర్స్ షాకిచ్చింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ముంబైతో జరుగుతున్న మ్యాచ్ లో   యూపీ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో  హర్మన్‌ప్రీత్ సేన.. నిర్ణీత  20 ఓవర్లలో  127 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ సీజన్ లో ముంబై ఆలౌట్ అవడం ఇదే తొలిసారి. యూపీ బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లలో హేలీ మాథ్యూస్, హర్మన్‌ప్రీత్ కౌర్, ఇస్సీ వాంగ్ మినహా మిగిలినవారు దారుణంగా విఫలమయ్యారు. మరి పటిష్ట బౌలింగ్ లైనప్ ఉన్న ముంబై  బౌలర్ల దాడిని తట్టుకుని యూపీ.. ఆ జట్టుకు ఓటమి రుచి చూపిస్తుందా..? 

టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన ముంబై ఇండియన్ ఇన్నింగ్స్  నెమ్మదిగా మొదలైంది.  తొలి మూడు ఓవర్లలో ఆ జట్టు  11 పరుగులు మాత్రమే రాబట్టింది. గ్రేస్ హరీస్ వేసిన  నాలుగో ఓవర్లో మాథ్యూస్ (30 బంతుల్లో 35,  1 ఫోర్, 3 సిక్సర్లు)  రెండు భారీ సిక్సర్లు  కొట్టింది. కానీ ఆ తర్వాతి ఓవర్ వేసిన అంజలి సర్వని బౌలింగ్ లో ఐదో బంతికి యస్తికా భాటియా  (7) క్లీన్ బౌల్డ్ అయింది. 

పర్శవి చోప్రా వేసిన ఏడో ఓవర్లో ఓ ఫోర్ కొట్టిన నటాలీ సీవర్ (5) .. ఎకిల్‌ప్టోన్ వేసిన 8వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగింది. పదో ఓవర్ వేసిన దీప్తి శర్మ బౌలింగ్ లో ఓ సిక్సర్ బాదింది. ముంబై ఇన్నింగ్స్ లో సగం ఆట ముగిసేసరికి  ఆ జట్టు స్కోరు  2 వికెట్ల నష్టానికి  56 పరుగులే  చేసింది. 

11వ ఓవర్లో ఎకిల్‌స్టోన్.. నాలుగో బంతికి  మాథ్యూస్ ను ఔట్ చేసింది.  వరుసగా వికెట్లు కోల్పోతున్నా  కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22, 3 ఫోర్లు) క్రీజులో ఉండటంతో ముంబై ధీమాగా ఉంది.    పర్శవి చోప్రా వేసిన  12వ ఓవర్లో కౌర్ రెండు ఫోర్లు కొట్టింది. కానీ రాజేశ్వరి గైక్వాడ్  వేసిన తర్వాతి ఓవర్లో   అమెలియా కెర్  (3) నిష్క్రమించింది. 14వ ఓవర్లో దీప్తి శర్మ.. ముంబైకి మరో షాకిచ్చింది. ఆ ఓవర్లో రెండో బంతికి  కౌర్.. భారీ షాట్ ఆడబోయి   బౌండరీ లైన్ వద్ద ఉన్న సిమ్రాన్ షేక్ కు క్యాచ్ ఇచ్చింది.  దీంతో ముంబై కష్టాలు మరింత పెరిగాయి. 

 

 కౌర్ నిష్క్రమించిన కొద్దిసేపటికే   అమన్‌జ్యోత్ కౌర్  (5), హుమైరా కాజీ (4) లు  కూడా అలా వచ్చి ఇలా వెళ్లారు.    17వ ఓవర్లో ముంబై స్కోరు వంద పరుగులుకు చేరింది.  ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఇస్సీ వాంగ్ (19 బంతుల్లో 32, 4 ఫోర్లు, 1 సిక్స్).. దీప్తి శర్మ బౌలింగ్ లో 6, 4 కొట్టడంతో  ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios