WPL 2023: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు వీరబాదుడు బాదారు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ లైన్ దాటించారు. ఓపెనర్లు షఫాలీ వర్మ, మెగ్ లానింగ్ లు వీరవిహారం చేశారు.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ లో రెండో మ్యాచ్ లో కూడా భారీ స్కోరు నమోదైంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు వీరబాదుడు బాదారు. దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీ లైన్ దాటించారు. ఓపెనర్లు షఫాలీ వర్మ (45 బంతుల్లో 84, 10 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ మెగ్ లానింగ్ (43 బంతుల్లో 72, 14 ఫోర్లు) తొలి వికెట్ కు 162 పరుగులు జోడించారు. ఈ ఇద్దరి జోరుకు తోడు చివర్లో మరిజన్నె కాప్ (17 బంతు్లలో 39, 3 ఫోర్లు, 3 సిక్సర్లు), జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 22, 3 ఫోర్లు) లు కూడా వీరవిహారం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ.. రెండు వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీకి ఓపెనర్లు షఫాలీ వర్మ, కెప్టెన్ మెగ్ లానింగ్ శతాధిక భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ కలిసి రెండో ఓవర్ నుంచే బ్యాట్ కు బాదే పని చెప్పారు. మేఘన్ వేసిన రెండో ఓవర్లో స్మృతి బౌండరీ కొట్టగా లానింగ్ రెండు ఫోర్లు బాదింది. డెవిన్ వేసిన ఆరో ఓవర్లో రెండో బంతికి షఫాలీ, లానింగ్ లు చెరో రెండు బౌండరీలు సాధించారు. ఆ ఓవర్లో 20 పరుగులొచ్చాయి. తొలి పవర్ ప్లే ముగిసేటప్పటికే ఢిల్లీ వికెట్లేమీ నష్టపోకుండా ద 57 పరుగులు చేసింది.
ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన షఫాలీ, లానింగ్ లు అర్థసెంచరీలకు చేరువయ్యారు. ఆశా శోభన వేసిన 9వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన షఫాలీ.. మేఘన్ వేసిన తర్వాతి ఓవర్లో నాలుగో బంతికి సింగిల్ తీసి ఈ లీగ్ లో తన తొలి హాఫ్ సెంచరీ (31 బంతుల్లోనే) ని అందుకుంది. ఇదే ఓవర్లో ఢిల్లీ స్కోరు వంద పరుగులు దాటింది.
మిడిల్ ఓవర్స్ లో ఓపెనర్లు మరింత రెచ్చిపోయారు. హీథర్ నైట్ వేసిన 11వ ఓవర్లో ఫోర్ కొట్టిన లానింగ్ కూడా 31 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. అర్థ సెంచరీ తర్వాత ఆమె మరింత రెచ్చిపోయింది. ఇక రేణుకా సింగ్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్లో షఫాలీ మూడు బౌండరీలు బాదింది. ప్రీతి బోస్ వేసిన 13వ ఓవర్లో లానింగ్ రెండు ఫోర్లు కొట్టింది. ఎల్లీస్ పెర్రీ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించడం ద్వారా ఢిల్లీ స్కోరు 150 పరుగులు దాటింది.
డబుల్ షాక్..
80లలోకి వచ్చి సెంచరీ దిశగా కదులుతున్న షఫాలీ.. శతకం బాదడం లాంఛనమే అనుకున్న సమయంలో ఆర్సీబీ బౌలర్ నైట్ 15వ ఓవర్లో ఢిల్లీకి డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. ఆ ఓవర్లో లానింగ్ తొలి రెండు బంతులను బౌండరీకి తరలించగా.. మూడో బంతికి క్లీన్ బౌల్డ్ అయింది. దీంతో 163 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. డబ్ల్యూపీఎల్ లో ఓపెనింగ్ భాగస్వామ్యంలో ఇది కొత్తగా నమోదైన రికార్డు. కాగా ఇదే ఓవర్లో ఐదో బంతికి షఫాలీ కూడా ముందుకొచ్చి ఆడి బంతి మిస్ కావడంతో వికెట్ కీపర్ రిచా ఘోషన్ స్టంపౌట్ చేసింది. దీంతో ఆమె సెంచరీ ఆశలు ఆవిరయ్యాయి.
కాప్, జెమీమాల జోరు..
ఓపెనర్లు ఒకే ఓవర్లో నిష్క్రమించినా తర్వాత వచ్చిన మారిజన్నె కాప్, జెమీమా రోడ్రిగ్స్ లు కూడా అదే దూకుడును కొనసాగించారు. కాప్.. పెర్రీ వేసిన 16వ ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్ బాదింది. రోడ్రిగ్స్ కూడా ప్రీతి బోస్ వేసిన 17వ ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు సాధించింది. ఇక నైట్ వేసిన 19వ ఓవర్లో కాప్ భారీ సిక్సర్ బాది ఢిల్లీ స్కోరును 200 దాటించింది. అదే ఓవర్లో ఆమె మరో సిక్సర్ బాదింది.
