WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ అభిమానుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. గడిచిన ఐదు మ్యాచ్ లలో ఓడిన ఆ జట్టు.. ఎట్టకేలకు బోణీ కొట్టింది. అన్ని విభాగాల్లో రాణించి యూపీకి షాకిచ్చింది.
హమ్మయ్య.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తమ జట్టు ఎప్పుడు గెలుస్తుందా..? అని ఎదురుచూసిన ఆర్సీబీ అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరింది. యూపీ వారియర్స్ తో డీవై పాటిల్ ప్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ.. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్ కనిక అహుజా (30 బంతుల్లో 46, 8 ఫోర్లు, 1 సిక్స్) తో పాటు వికెట్ కీపర్ రిచా ఘోష్ (32 బంతుల్లో 31 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఈ లీగ్ లో ఆర్సీబీ తొలి విజయాన్ని నమోదు చేసింది. తొలుత ఆర్సీబీ బౌలర్లు రాణించడంతో యూపీ 135 పరుగులకే ఆలౌటైంది. 136 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ.. 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఛేదనలో ఆర్సీబీకి తొలి ఓవర్లోనే షాక్ తాకింది. గ్రేస్ హరీస్ వేసిన తొలి ఓవర్ లో సోఫీ డివైన్.. రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాది చివరి బంతికి మెక్‌గ్రాత్ కు క్యాచ్ ఇచ్చింది. దీప్తి శర్మ వేసి రెండో ఓవర్లో మూడో బంతికి స్మృతి మంధాన (0) క్లీన్ బౌల్డ్ అయింది.
వరుస షాకులు..
వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో ఆర్సీబీకి యూపీ షాకివ్వనుందా..? అని ఆర్సీబీ అభిమానులు భావించారు. ఎలీస్ పెర్రీ (10) తో కలిసి హెథర్ నైట్ (21 బంతుల్లో 24, 5 ఫోర్లు) ఆర్సీబీని నిలబెట్టేందుకు యత్నించింది. రాజేశ్వరి గైక్వాడ్ వేసిన మూడో ఓవరల్లో నైట్ రెండు బౌండరీలు కొట్టింది. ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 29 పరగులు జోడించారు. అయితే ఏడో ఓవర్లో.. దేవికా వైద్య ఆర్సీబీకి షాకిచ్చింది. ఆ ఓవర్లో తొలి బంతికే పెర్రీ.. ఎకిల్‌స్టోన్ చేతికి చిక్కింది. 9వ ఓవర్లో దీప్తి.. నైట్ ను కూడా ఔట్ చేసి యూపీ శిబిరంలో ఆశలు రేపింది.
మెరుపు కనిక..
యూపీ షాకులిస్తుండటంతో ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో ఓటమి ఖాయమనే అనిపించింది. కానీ కనిక అహుజా మాత్రం ఆర్సీబీ రాత మార్చింది. గ్రేస్ హరీస్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన ఆమె.. గైక్వాడ్ వేసిన తర్వాతి ఓవర్లో మూడు బౌండరీలు సాధించింది. దేవికా వైద్య వేసిన 13వ ఓవర్లో రెండో బంతికి కనిక సిక్సర్ కొట్టగా చివరి బంతికి రిచా ఫోర్ కొట్టింది. దీంతో బెంగళూరు స్కోరు వంద పరుగులు దాటింది.
హరీస్ వేసిన 15వ ఓవర్లో రెండు ఫోర్లు వచ్చాయి. ఎకిల్‌స్టోన్ వేసిన 17వ ఓవర్లో నాలుగో బంతికి కనిక క్లీన్ బౌల్డ్ అయింది. కానీ అప్పటికే ఆర్సీబీ విజయం ఖాయమైపోయింది. కనిక-రిచాలు కలిసి ఐదో వికెట్ కు 60 పరుగులు జోడించారు. విజయానికి 3 ఓవర్లలో 12 పరుగులు అవసరముండగా దీప్తి శర్మ వేసిన 18వ ఓవర్లో రిచా.. 4,6 బాది ఆర్సీబీకి ఈ సీజన్ లో తొలి విజయాన్ని అందించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ.. 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ జట్టులో గ్రేస్ హరీస్ (46) టాప్ స్కోరర్. దీప్తి శర్మ (22), కిరణ్ నవ్‌గిరె (22) లు ఫర్వాలేదనిపించారు. ఆర్సీబీ బౌలర్లో పెర్రీ మూడు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లు వేసిన ఆమె.. 16 పరుగులే ఇచ్చి కీలక వికెట్లు పడగొట్టింది. ఆశా శోభన, సోఫీ డివైన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టగా శ్రేయాంక పాటిల్, మేగన్ షుట్ చెరొక వికెట్ తీశారు.
