WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న ముంబై ఇండియన్స్ మరోసారి  దుమ్మురేపింది. మెరుగైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ను  తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.  

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి రెండు మ్యాచ్ లలో ధాటిగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్.. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢీలా పడింది. ముంబై బౌలర్ల ధాటికి ఆ జట్టు బ్యాటర్లు పెవిలియన్ కు చేరడానికి పోటీ పడ్డారు. ఢిల్లీ కెప్టెన్ మెగ్ లానింగ్ (41 బంతులలో 43, 5 ఫోర్లు), జెమీమా రోడ్రిగ్స్ (18 బంతుల్లో 25, 3 ఫోర్లు) మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్ స్కోరు చేయడానికే నానా తంటాలు పడ్డారు. ఫలితంగా ఢిల్లీ.. 18 ఓవర్లలో 105 పరుగులకే పరిమితమైంది. ముంబై బౌలర్లలో ఇషాక్, వాంగ్ ల ధాటికి ఢిల్లీ విలవిల్లాడింది. 

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ కు శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ (2) తో పాటు వన్ డౌన్ లో వచ్చిన అలీస్ క్యాప్సీ (6), మరిజనె కాప్ (2), జెస్ జొనాసేన్ (2) లు అలా వచ్చి ఇలా వెళ్లారు.

సీవర్ వేసిన తొలి ఓవర్లో మొదటి బంతినే బౌండరీకి తరలించి ఖాతా తెరిచింది మెగ్ లానింగ్. కానీ సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో షఫాలీ వర్మ క్లీన్ బౌల్డ్ అయింది. ఐదో ఓవర్లో వస్త్రకార్.. క్యాప్సీని పెవిలియన్ కు పంపింది. తర్వాతి ఓవర్లో వాంగ్.. కాప్ ను క్లీన్ బౌల్డ్ చేసింది.

సీవర్ వేసిన 8వ ఓవర్లో రోడ్రిగ్స్ హ్యాట్రిక్ ఫోర్లు బాదింది. అయినా ఆది నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో పది ఓవర్లలో ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 58 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

అమెలియా కెర్ వేసిన 11వ ఓవర్లో లానింగ్ మూడు ఫోర్లు కొట్టింది. ధాటిగా ఆడుతున్న రోడ్రిగ్స్ ను ఇషాక్.. 12వ ఓవర్ ద రెండో బంతికి బోల్డ్ చేసింది. ఇదే ఓవర్లో ఆఖరి బంతికి లానింగ్ కూడా ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.

మాథ్యూస్ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి ముందుకొచ్ిచ ఆడేందుకు యత్నించిన మిన్ను మణి (0) ని యస్తికా భాటియా స్టంపింగ్ చేసింది. దీంతో 9 బంతుల వ్యవధిలో ఢిల్లీ 3 పరుగులే చేసి నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 7 వికెట్ల నష్టానికి 89 పరుగులుగా ఉంది. 

17వ ఓవర్ వేసిన వాంగ్.. తొలి బంతికే తానియా భాటియాను ఔట్ చేసింది. అదే ఓవర్లో చివరిబంతికి రాధా యాదవ్ కూడా పెవిలియన్ చేరింది. మాథ్యూస్ వేసిన 18వ ఓవర్లో నోరిస్ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది.

ముంబై బౌలర్లలో ఇస్సీ వాంగ్.. నాలుగు ఓవర్లు వేసి 10 పరగులే ఇచ్చి 3 వికెట్లు తీసింది. ఇషాక్ కూడా 3 ఓవర్లలో 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. హేలి మాథ్యూస్ కు మూడు, వస్త్రకార్ కు ఒక వికెట్ దక్కాయి.