Asianet News TeluguAsianet News Telugu

లారా హాఫ్ సెంచరీ.. చివర్లో రెచ్చిపోయిన హర్లీన్, హేమలత.. ఆర్సీబీ ఎదుట భారీ టార్గెట్ పెట్టిన గుజరాత్..

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో  ప్లేఆఫ్స్ లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన  మ్యాచ్  లో  గుజరాత్ జెయింట్స్ బ్యాటర్లు  రెచ్చిపోయారు.   ఆ జట్టు బౌలర్లకు  పోరాడే అవకాశాన్నిచ్చారు.  

WPL 2023: Laura Wolvaardt  Fifty Helps Gujarat Giants To Fighting Total Against RCB  MSV
Author
First Published Mar 18, 2023, 9:08 PM IST

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో  గుజరాత్ సింహాలు జూలు విదిల్చాయి.  ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్.. నిర్ణీత 20 ఓవర్లలో  4 వికెట్లు కోల్పోయి 188  పరుగులు చేసింది.  ఆ జట్టు ఓపెనర్  లారా వోల్వార్డ్ట్ (42 బంతుల్లో  9 ఫోర్లు, 2 సిక్సర్లు)  కు తోడుగా ఆల్ రౌండర్ ఆష్లే గార్డ్‌నర్ (26 బంతుల్లో 41, 6 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో  గుజరాత్ భారీ స్కోరు సాధించింది.  మరి ఈ లక్ష్యాన్ని గుజరాత్ బౌలర్లు కాపాడుకుంటారా..? అనేది ఇప్పుడు ఆసక్తికరం.  

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన  గుజరాత్ జెయింట్స్ ఓపెనర్  సోఫీ డంక్లీ  (16)  మూడు ధనాధన్ ఫోర్లు బాది  జోరుమీద కనిపించింది. కానీ సోఫీ డివైన్ వేసిన మూడో ఓవర్లో  నాలుగో బంతికి  ఆమె  క్లీన్ బౌల్డ్ అయింది.  

వన్ డౌన్ లో వచ్చిన ఆంధ్రా అమ్మాయి సబ్బినేని మేఘన (32 బంతుల్లో 31, 4 ఫోర్లు) తో కలసి  లారా వోల్వార్డ్ట్  గుజరాత్ ఇన్నింగ్స్ ను నడిపించింది.   లారా కూడా  దూకుడుగా ఆడటంతో  తొలి  ఆరు ఓవర్లలో గుజరాత్.. వికెట్ నష్టానికి  45 పరుగులు చేసింది.   కానీ స్పిన్నర్ల రంగ ప్రవేశంతో మిడిల్ ఓవర్స్ లో గుజరాత్ స్కోరు వేగం తగ్గింది. 

అయితే  హెథర్ నైట్ వేసిన  పదో ఓవర్లో    మేఘన, వోల్వార్డ్డ్ లు తలా ఓ ఫోర్ కొట్టారు. నాలుగు ఫోర్లు కొట్టి జోరుమీద ఉన్న మేఘన.. ప్రీతి బోస్ వేసిన  12వ ఓవర్లో  రిచా ఘోష్ స్టంపౌట్ చేయడంతో వెనుదిరిగింది. లారా-మేఘనలు రెండో వికెట్ కు 63 పరుగులు జోడించారు. ఇక ఎలీస్ పెర్రీ వేసిన  14వ ఓవర్లో వోల్వార్డ్ట్ మూడో బంతికి ఫోర్ కొట్టడంతో  గుజరాత్ వంద పరుగుల మార్కును చేరింది. అదే ఓవర్లో  చివరి బంతికి  వోల్వార్డ్ట్ భారీ సిక్సర్ బాదింది.  దీంతో 35 బంతుల్లో ఆమె అర్థ సెంచరీ పూర్తయింది.  15 ఓవర్లు ముగిసేసరికి   గుజరాత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి  121 పరుగులకు చేరింది.  

 

హాఫ్ సెంచరీ తర్వాత వోల్వార్డ్ట్  మరింత రెచ్చిపోయింది.   మేగన్ షుట్ వేసిన  16వ ఓవర్లో ఆమె.. 6, 4 బాదింది.  తర్వాత ఓవర్లో ఆమె.. భారీ షాట్ ఆడబోయి ప్రీతి బోస్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది.  ఆశా శోభన వేసిన   18వ ఓవర్లో  మూడు ఫోర్లు కొట్టిన  గార్డ్‌నర్ .. శ్రేయాంక  విసిరిన 19వ ఓవర్లో  రెండో బంతికి బౌండరీ సాధించింది. కానీ  ఆ తర్వాతి బంతికి వికెట్ల ముందు దొరికిపోయింది. చివర్లో హర్లీన్ డియోల్ (12 నాటౌట్), హేమలత (16 నాటౌట్) లు గుజరాత్ స్కోరును  180 మార్క్ దాటించారు. చివరి ఓవర్లో  హర్లీన్ 4, 6  కొట్టగా  హేమలత  కూడా అదే సీన్ రిపీట్ చేసింది. మేగన్ షుట్ వేసిన  చివరి ఓవర్లో 22 పరుగులొచ్చాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios