WPL 2023: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అట్టహాసంగా మొదలైంది.
భారత క్రికెట్‌లో సరికొత్త అధ్యాయానికి తెరతీస్తూ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ లీగ్ తొలి సీజన్ లో భాగంగా ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలీవుడ్ నటీమణులు కియారా అధ్వాణీ, కృతి సనన్ లతో పాటు శంకర్ మహదేవన్, ఏపీ ధిల్లాన్ ల ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. కాగా నేడు జరుగుతున్న తొలి మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్.. ముంబై ఇండియన్స్ పై టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
రీషెడ్యూల్డ్ టైమింగ్స్ ప్రకారం 6.30 గంటలకు ఆరంభ వేడుకలు మొదలయ్యాయి. తొలుత కియారా అధ్వాణీ, కృతి సనన్ లు బాలీవుడ్ పాటలకు డాన్సులు చేశారు. ఈ సందర్భంగా బీసీసీఐ.. డబ్ల్యూపీఎల్ మస్కట్ ను కూడా విడుదల చేసింది.
ఆరంభ వేడుకల తర్వాత ఐదు జట్ల సారథులు డబ్ల్యూపీఎల్ ట్రోఫీని విడుదల చేశారు. హర్మన్‌ప్రీత్, మంధానలు స్టేజీ మీదకు రాగానే ప్రేక్షకులు చప్పట్లతో వారికి సాదర స్వాగతం పలికారు.
కాగా నేడు గుజరాత్ జెయింట్స్ తో మ్యాచ్ సందర్భంగా తొలి మ్యాచ్ లో గెలిచి ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టు వారసత్వాన్ని ఘనంగా ఆరంభించాలని ముంబై కోరుకుంటున్నది. గుజరాత్ కూడా శుభారంభం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. టాస్ సందర్భంగా గుజరాత్ సారథి బెత్ మూనీ, ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ లు డబ్ల్యూపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తుది జట్లు :
గుజరాత్ జెయింట్స్ : బెత్ మూనీ (కెప్టెన్), సబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్‌నర్, డి.హేమలత, అన్నాబెల్ సదర్లాండ్, వెర్హమ్, స్నేహ్ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మాన్సి జోషి
ముంబై ఇండియన్స్ : హేలీ మాథ్యూస్, యస్తికా భాటియా, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), నటాలి సీవర్, అమెలియా కెర్, అమన్‌జ్యోత్ కౌర్, పూజా వస్త్రకార్, హుమేరియా కాజి, ఇస్సి యంగ్, జింతిమని కలిత, సైకా ఇషాక్
