WPL 2023: భారీ అంచనాలతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోకి అడుగుపెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుస ఓటములతో కుంగిపోతోంది. నేడు యూపీతో తలపడబోయే మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకం.
వరుసగా ఐదు ఓటములతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తున్న స్మృతి మంధాన సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు నేడు కీలక మ్యాచ్ ఆడబోతుంది. ముంబై లోని డాక్టర్ డీవై పాటిల్ స్టేడియం వేదికగా యూపీ వారియర్స్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఇక ఆర్సీబీ అధికారికంగా బ్యాగ్ సర్దుకోవడమే. గాలిలో దీపంలా ఉన్న ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆర్సీబీ నేటి మ్యాచ్ ను కచ్చితంగా గెలిచితీరాలి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ.. తొలుత ఫీల్డింగ్ కు రానుంది. యూపీ బ్యాటింగ్ చేయనుంది.
భారీ అంచనాలతో ఈ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆర్సీబీ.. అందుకు తగ్గట్టుగా వేలంలో కూడా స్టార్ ప్లేయర్లనే కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు ఉన్న ఆల్ రౌండర్లను దక్కించుకుంది. అయినా ఆ జట్టుకు విజయాలు మాత్రం దక్కడం లేదు.
ఢిల్లీ క్యాపిటల్స్ తో రెండు మ్యాచ్ లు మిగిలిన మూడు జట్లతో మూడు పరాజయాలు ఎదుర్కున్న ఆర్సీబీ.. నేడు యూపీతో రెండో మ్యాచ్ లో తలపడుతున్నది. గత మ్యాచ్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ.. 138 పరుగులకే ఆలౌట్ కాగా యూపీ.. 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్ లో కెప్టెన్ అలీస్సా హేలి.. 47 బంతుల్లోనే 18 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.
ఈ మ్యాచ్ లో గెలవడం ఆర్సీబీకి చాలా కీలకం. ప్లేఆఫ్స్ చేరడానికి ఇప్పటికిప్పుడు ఆర్సీబీకి ఉన్న అవకాశాలు ఆ జట్టు విజయాలతో పాటు ఇతర జట్ల ఫలితాల మీద కూడా ఆధారపడి ఉంది. ఇప్పటికే ఐదు మ్యాచ్ లు ఓడిన ఆర్సీబీ.. నేటి మ్యాచ్ తో కలిపి మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. యూపీ, గుజరాత్, ముంబైలతో ఆ జట్టు మ్యాచ్ లను ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లను తప్పనిసరిగా గెలివాలి.అంతేగాక ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్, ద్వితీయ స్థానంలోని ఢిల్లీ క్యాపిటల్స్ లు తాము తర్వాత ఆడబోయే మ్యాచ్ లలో విజయాలు సాధించాలి. అప్పుడు ఆర్సీబీ మూడో స్థానానికి వెళ్లే (?) అవకాశాలుంటాయి.
పాయింట్ల పట్లికలో యూపీ వారియర్స్.. మూడో స్థానంలో ఉంది. తాము ఆడిన తొలి మ్యాచ్ (గుజరాత్), ఆర్సీబీతో మ్యాచ్ ను గెలుచుకున్న యూపీ.. ముంబై, ఢిల్లీతో మాత్రం ఓడింది. ప్లేఆఫ్స్ చేరడానికి ఆ జట్టుకు కూడా ఈ మ్యాచ్ కీలకం. నాలుగు మ్యాచ్ లలో రెండు గెలుపులు, రెండు ఓటములతో ఆ జట్టు మూడో స్థానంలో ఉంది. నిబంధనల ప్రకారం.. ప్రతీ జట్టూ తమ ప్రత్యర్థి జట్టుతో రెండేసి మ్యాచ్ లు ఆడాలి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. రెండు, మూడు స్థానాల్లో ఉన్న టీమ్స్ ఫైనల్ లో రెండో బెర్త్ కోసం ప్లేఆఫ్స్ ఆడతాయి. చివరి రెండు టీమ్స్ ఇంటిబాట పడతాయి ఈ లెక్కన యూపీ ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ఆర్సీబీని ఓడిస్తే యూపీ మూడో స్థానాన్ని పదిలం చేసుకుని ప్లేఆఫ్స్ బెర్త్ ను మరింత ఖాయం చేసుకుంటుంది.
తుది జట్లు :
ఆర్సీబీ : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, హెథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోభన, కనికా అహుజా, రేణుకాసింగ్ ఠాకూర్
యూపీ : దేవికా వైద్య, అలీస్సా హేలి (కెప్టెన్), కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, సిమ్రాన్ షేక్, సోఫీ ఎకిల్‌స్టోన్, శ్వేతా సెహ్రావత్, గ్రేస్ హరీస్, అంజలి శర్వణి, రాజేశ్వరి గైక్వాడ్
