WPL 2023: ముంబై వేదికగా జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ ను విజయవంతం చేయడానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి  (బీసీసీఐ) మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి సీజన్.. ఇప్పటికే ఈ లీగ్ కు కావాల్సినంత క్రేజ్ వచ్చింది. తొలి మూడు రోజులకు గాను మ్యాచ్ టికెట్లు అయిపోయాయి. మహిళలకు, అమ్మాయిలకు ఉచితంగా మ్యాచ్ అనడంతో స్టేడియాలు నిండుతున్నాయి. ఇంత చేసినా బీసీసీఐ మాత్రం సంతృప్తిగా లేదా..?అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. తొలి సీజన్ ను విజయవంతం చేయడానికి బీసీసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బౌండరీ లైన్ ను తగ్గించి బ్యాటర్లు భారీ స్కోర్లు బాదేలా చేసింది. 

అసలే అమ్మాయిల క్రికెట్ కు మనదేశంలో అంతంత మాత్రమే క్రేజ్ ఉంటుంది. కానీ దానిని డబుల్ చేయడానికి డబ్ల్యూపీఎల్ ను తీసుకొచ్చినా దానిని ఎలా సక్సెస్ చేసేందుకు బీసీసీఐ చేయాల్సినవన్నీ చేస్తున్నది. 

మాములుగా పురుషుల క్రికెట్ తో పోల్చితే అమ్మాయిల టీ20 క్రికెట్ లో లో స్కోరింగ్ గేమ్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే లో స్కోరింగ్ గేమ్స్ చూడటానికి అభిమానులు అంతగా ఆసక్తి చూపరు. భారీ స్కోర్లు నమోదైతేనే వాటిని చూసేందుకు జనం ఎగబడతారు. ఇది కనిపెట్టిన బీసీసీఐ.. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ లో బౌండరీ లైన్ ను కుదించింది. డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాలలో బౌండరీ లైన్ ను 60 మీటర్లకు తగ్గించింది.

కొద్దిరోజుల క్రితం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ లో బౌండరీ లైన్ ను 65 మీటర్లుగా నిర్దేశించారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మాత్రం దానిని ఐదు మీటర్లు తగ్గించడం గమనార్హం.

ఫలితంగా నిన్నటి గుజరాత్-ముంబై మ్యాచ్ లో బౌండరీల వర్షం కురిసింది. ఓపెనర్ హీలి మాథ్యూస్.. 31 బంతుల్లోనే 3 బౌండరీలు, 4 భారీ సిక్సర్లను బాదింది. సీవర్ ఐదు ఫోర్లు కొట్టగా.. ముంబై సారథి 30 బంతుల్లోనే 14 బౌండరీల సాయంతో 65 పరుగులు చేసింది. అమిలియా ఆరు, పూజా వస్త్రకార్ 3 ఫోర్లు బాదారు. ముంబై ఇన్నింగ్స్ లో 31 ఫోర్లు, ఆరు సిక్సర్లు నమోదయ్యాయి. దీంతో ముంబై.. 20 ఓవర్లలోనే 207 పరుగుల భారీ స్కోరు చేయడం గమనార్హం. 

Scroll to load tweet…

గుజరాత్ ఇన్నింగ్స్ లో హేమలత ఒక ఫోర్, వెర్హమ్ రెండు, మోనికా లు రెండు ఫోర్లు కొట్టారు. హేమలత రెండు సిక్సర్లు బాదింది.

కాగా హై స్కోరింగ్ గేమ్స్ కోసం బీసీసీఐ ఇంతకు దిగజారాలా..? అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ లో పిచ్ లు సాధారణంగానే బ్యాటింగ్ కు అనులకూలించేవి. ఇక ఇప్పుడు బౌండరీ లైన్ ను తగ్గిస్తే అది పూర్తిగా బ్యాటర్లకు మేలు చేసి ఫీల్డింగ్ చేసే జట్టుకు అన్యాయం చేసినట్టేనని కామెంట్స్ వినిపిస్తున్నాయి. బంతి - బ్యాట్ మధ్య సమానమైన పోరాటం ఉండాలంటే నిబంధనల ప్రకారం మ్యాచ్ లను నిర్వహించాలని బీసీసీఐని కోరుతున్నారు.