ప్రపంచ దేశాల మధ్య వచ్చే నెలలో జరగనున్న క్రికెట్ సమరానికి వెస్టిండిస్ సిద్దమయ్యింది. ఇప్పటికే  అన్ని దేశాలు ప్రపంచ కప్ జట్లను ప్రకటించగా చివరగా విండీస్ కూడా ఆ పనిని పూర్తి చేసింది. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక విషయంలో విండీస్ బోర్డు సంచలన నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంది. 

15 మంది సభ్యులతో కూడిన ప్రపంచకప్‌ జట్టును విండీస్ ప్రకటించింది. 2015లో ఒకే ఒక వన్డే ఆడి అప్పటి నుండి జట్టుకు దూరంగా  వున్న ఆండీ రస్సెల్ ప్రపంచ కప్ కు ఎంపికవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే మరో సీనియర్ ప్లేయర్, హిట్టర్ కిరన్ పొలార్డ్ కు మాత్రం విండీస్ బోర్డు మొండిచేయి చూపింది. అలాగే మార్లోన్ శ్యామూల్స్ కూడా ప్రపంచ కప్ ఆడేందుకు ఎంపికలేదు. 

మరో సీనియర్ ఆటగాడు క్రిస్ గేల్ కు మరోసారి ప్రపంచ కప్ ఆడే అవకాశం వచ్చింది. ఇలా ఐదో వరల్డ్ కప్ ఆడుతున్న గేల్ ఈ మెగా టోర్నీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు ఇదివరకే వెల్లడించారు. గౌరవప్రదంగా అతన్ని వన్డేల నుండి సాగనంపై ఉద్దేశంతో విండీస్ బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక బౌలర్ విషయానికి వస్తే సునీల్ నరైన్ కు జట్టులో చోటు దక్కలేదు. పాస్ట్ బౌలర్ గ్యాబ్రియల్ రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ ప్రపంచ కప్ ఆడనున్నాడు. అలాగే ఇటీవల ఇంగ్లాండ్ సీరిస్ కు గాయం కారణంగా దూరమైన ఎవిన్ లూయిస్, కీమర్ రోచ్ లు కూడా వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. జేసన్‌ హోల్డర్‌ విండీస్  జట్టుకు నాయకత్వం వహిస్తాడు. 

విండీస్ ప్రపంచ కప్ జట్టు: 

జేసన్ హోల్డర్‌ (కెప్టెన్‌), క్రిస్ గేల్‌, ఎవిన్‌ లూయిస్‌, డారెన్‌ బ్రావో, ఆండ్రీ రసెల్‌, షై హోప్‌,హెట్మెయర్‌, కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, నికోలస్‌ పూరన్‌ (వికెట్‌ కీపర్‌), ఆష్లే నర్స్‌, ఫాబియన్‌ అలెన్‌, కీమర్‌ రోచ్‌, ఒషానె థామస్‌, గాబ్రియల్‌, షెల్డన్‌ కాట్రెల్‌