ఇస్లామాబాద్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా దాయాదాలు పాకిస్తాన్, ఇండియా ఆదివారం తలపడబోతున్న స్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబి) చీఫ్ ఎహసాన్ మని సంచలన ప్రకటన చేశారు. తమతో క్రికెట్ ఆడాలని తాము ఇండియాను యాచంచబోమని ఆయన చెప్పారు. 

భారత్ తో ద్వైపాక్షిక సిరీస్ లు జరగాలని తాము కోరుకుంటున్నామని, అయితే అది మర్యాదపూర్వకంగా, హుందా జరగాలని ఆయన అన్నారు. తమతో క్రికెట్ ఆడాలని ఇండియాను గానీ ఇతర దేశాలను గానీ యాచించబోమని అన్నారు. గడాఫీ స్టేడియంలో ఆయన మీడియాతో మాట్లాడిన వార్తాకథనాన్ని డాన్ ప్రచురించింది. 

పాకిస్తాన్, ఇండియా మధ్య 2013 జనవరి నుంచి ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు జరగలేదు. అయితే, ఇతర దేశాలు పాల్గొన్న ఈవెంట్స్ లో రెండు జట్లు పలుమార్లు తలపడ్డాయి. భారత్ లో నవంబర్ లో జరిగే ఐసిసి మహిళా క్రికెట్ చాంపియన్ షిప్ పోటీల్లో పాకిస్తాన్ పాల్గొంటుందని మని చెప్పారు. 

అది ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడానికి తగిన వాతావరణం ఉందని భావించడానికి సాయపడుతుందని ఆయన అన్నారు. పాకిస్తాన్ లో అంతర్జాతీయ మ్యాచులకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచులకు సెప్టెంబర్ లో తాము ఆతిథ్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాల్లో తమ జట్టు ఆస్ట్రేలియాలో ఆ దేశపు జట్టుతో వన్డేలు, ట్వంటీ20లు ఆడుతుందని చెప్పారు.