టీ20 వరల్డ్ కప్ 2023: రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ని 6 పరుగుల తేడాతో ఓడించిన సౌతాఫ్రికా... ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్ చేరిన సఫారీ టీమ్..
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు సౌతాఫ్రికా క్రికెట్‌లో చాలా పెద్ద చర్చే జరిగింది. ఫిట్‌నెస్ సరిగా లేదనే కారణంతో ఉమెన్స్ టీమ్ కెప్టెన్ డేన్ వాన్ నీరెక్‌ని టీమ్ నుంచి తప్పించారు సెలక్టర్లు. ఫిట్‌నెస్ టెస్టు క్లియర్ చేయలేదని కెప్టెన్‌నే టీమ్ నుంచి పక్కనబెట్టడంతో పెద్ద దుమారమే రేగింది. ఆ తర్వాత వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో శ్రీలంక చేతుల్లో 3 పరుగుల తేడాతో ఓడింది సౌతాఫ్రికా మహిళా జట్టు...
ఎప్పటిలాగే సౌతాఫ్రికా, ఐసీసీ టోర్నీల్లో ఫెయిల్ అవ్వడం కామన్ అనుకున్నారంతా. అయితే అన్యూహ్యంగా తొలి మ్యాచ్ ఓటమి తర్వాత తిరుగులేని విజయాలతో ఫైనల్‌కి దూసుకొచ్చింది సౌతాఫ్రికా. ఆఖరి గ్రూప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 10 వికెట్ల తేడాతో గెలిచి సెమీస్ చేరిన సఫారీ మహిళల టీమ్, ఇంగ్లాండ్‌పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది...
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. లౌరా వాల్వరెట్ 44 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 53 పరుగులు చేయగా తజ్మిన్ బ్రిట్స్ 55 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కి 96 పరుగుల భాగస్వామ్యం జోడించారు..
మెరిజేన్ కెప్ 13 బంతుల్లో 4 ఫోర్లతో 27 పరుగులు చేయగా ఇంగ్లాండ్ బౌలర్ ఎక్లెస్టోన్ 3 వికెట్లు పడగొట్టింది. 165 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇంగ్లాండ్ మహిళా జట్టు, 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులకి పరిమితమైంది..
డానియల్ వ్యాట్ 30 బంతుల్లో 6 ఫోర్లతో 34 పరుగులు చేయగా సోఫి డంక్లే 16 బంతుల్లో 6 ఫోర్లతో 28 పరుగులు చేసింది. అలీసా కాప్సీ డకౌట్ కాగా నాట్ స్కివర్ బ్రంట్ 34 బంతుల్లో 5 ఫోర్లతో 40 పరుగులు చేసింది..
కెప్టెన్ హేథర్ నైట్ 25 బంతుల్లో 2 ఫోర్లతో 31 పరుగులు చేయగా ఆఖరి ఓవర్‌లో ఇంగ్లాండ్ విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చాయి. మొదటి బంతికి సింగిల్ రాగా రెండో బంతికి పరుగులేమీ రాలేదు. మూడో బంతికి కెప్టెన్ హేథర్ నైట్‌ని క్లీన్ బౌల్డ్ చేసింది ఇస్మాయిల్. ఆ తర్వాత మూడు బంతుల్లో 5 పరుగులు మాత్రమే రావడంతో సౌతాఫ్రికా ఫైనల్‌కి అర్హత సాధించింది..
సౌతాఫ్రికా టీమ్ ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. సౌతాఫ్రికా పురుషుల జట్టు కూడా ఎప్పుడూ ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీల్లో ఫైనల్ చేరలేదు. ఆదివారం డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది సౌతాఫ్రికా మహిళా టీమ్... మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టుపై 5 పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా, రికార్డు స్థాయిలో ఏడోసారి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే..
