థాయిలాండ్‌ని 37 పరుగులకి ఆలౌట్ చేసిన భారత మహిళా జట్టు... 6 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం.. 

వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో భారత మహిళా జట్టు టేబుల్ టాపర్‌గా సెమీ ఫైనల్‌కి ప్రవేశించింది. థాయిలాండ్‌తో జరిగిన ఆఖరి లీగ్‌లో మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది భారత మహిళా జట్టు... టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు, థాయిలాండ్ వుమెన్స్ జట్టుని 37 పరుగులకి ఆలౌట్ చేసింది...

 పాకిస్తాన్‌పై ఘన విజయం అందుకుని చరిత్ర క్రియేట్ చేసిన థాయిలాండ్ మహిళా జట్టు, దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. 11 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన నాథకన్ ఛాంతమ్, దీప్తి శర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసిన ఎన్ కోచర్కోయ్‌ని దీప్తి శర్మ రనౌట్ చేసింది. 20 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది థాయిలాండ్...

అయితే ఆ తర్వాత స్నేహ్ రాణా మ్యాజిక్ స్పెల్‌తో థాయిలాండ్ బ్యాటర్లు పెవిలియన్‌కి క్యూ కట్టారు.సుత్తిరున్‌ని గోల్డెన్ డకౌట్ చేసిన స్నేహ్ రాణా, 2 పరుగులు చేసిన తిప్పోచ్‌ని క్యాచ్ అండ్ బౌల్ ద్వారా పెవిలియన్ చేర్చింది. కెప్టెన్ చౌవాయ్ 3 పరుగులు చేసి రనౌట్ కాగా పన్నీత మయ 6 బంతుల్లో 1 పరుగు చేసి రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యింది. 

రొసనన్ కరోన్‌ని డకౌట్ చేసిన స్నేహ్ రాణా 4 ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. బొచాతమ్ 7 పరుగులు చేసి మేఘనా సింగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా ఒనిచా కంచొపు, రాజేశ్వరి గైక్వాడ్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యింది. తపిచా పుత్తావాంగ్ 5 పరుగులు చేసింది. 14 పరుగుల తేడాతో 7 వికెట్లు కోల్పోయిన థాయిలాండ్, 13/0 నుంచి 37 పరుగులకే 10 వికెట్లు కోల్పోయింది... 

దీప్తి శర్మ 4 ఓవర్లలో 10 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా రాజేశ్వరి గైక్వాడ్ 3 ఓవర్లలో 8 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. మేఘనా సింగ్‌ ఓ మెయిడిన్‌తో ఓ వికెట్ తీసింది...

38 పరుగుల లక్ష్యఛేదనలో షెఫాలీ వర్మ వికెట్ త్వరగా కోల్పోయింది టీమిండియా. 6 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన షెఫాలీ వర్మ, బొచాథమ్ బౌలింగ్‌లో తిప్పొచ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైంది. తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన 18 బంతుల్లో 3 ఫోర్లతో 20 పరుగులు చేయగా పూజా వస్త్రాకర్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసింది. కేవలం 6 ఓవర్లలో 40 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించింది టీమిండియా...

ఈ మ్యాచ్‌ స్మృతి మంధానకి 100వ టీ20. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 135 టీ20 మ్యాచ్‌లతో టాప్‌లో ఉండగా 100కి పైగా అంతర్జాతీయ టీ20 మ్యాచులు ఆడిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచింది స్మృతి మంధాన. భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ 89, వేదా కృష్ణమూర్తి 76, దీప్తి శర్మ 75 టీ20 మ్యాచులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు..