ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ జట్టు.. ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్‌తో మ్యాచ్‌లో ఓడిన భారత మహిళా జట్టు...
ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ 2022 టోర్నీలో పాకిస్తాన్‌పై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది...
మరోవైపు ఆసియా కప్ టోర్నీలో ఫైనల్‌కి కూడా రాలేకపోయిన పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు, ఈసారి టీమిండియాని ఓడించి టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఘనమైన ప్రారంభం దక్కించుకోవాలని చూస్తోంది. 2020 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ చేరిన భారత జట్టు, ఆస్ట్రేలియా చేతుల్లో చిత్తుగా ఓడి రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకుంది...
భారత వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన నేటి మ్యాచ్‌లో బరిలో దిగడం లేదు. కొంత కాలంగా చేతి వేలి గాయంతో బాధపడుతున్న స్మృతి మంధాన, పూర్తిగా కోలుకోకపోవడంతో నేటి మ్యాచ్‌లో ఆడడం లేదు. ఆమె స్థానంలో షెఫాలీ వర్మతో కలిసి యంగ్ వికెట్ కీపర్ యషికా భాటియా ఓపెనింగ్ చేయనుంది.
భారత మహిళా జట్టు: షెఫాలీ వర్మ, యషికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్.
పాకిస్తాన్ మహిళా జట్టు ఇది: జావెరియా ఖాన్, మునీబా ఆలీ (వికెట్ కీపర్), బిస్మా మరూఫ్ (కెప్టెన్), నిదా దర్, సిద్రా ఆమీన్, అలియా రియాజ్, అయేషా నసీం, ఫాతిమా సనా, అమైన్ అన్వర్, నశ్రా సంధు, సదియా ఇక్బాల్
అండర్19 టీ20 వరల్డ్ కప్ టైటిల్ విన్నర్‌గా నిలిచిన భారత మహిళా జట్టు, అదే రేంజ్ పర్ఫామెన్స్‌ని అసలైన సీనియర్స్ టీ20 వరల్డ్ కప్‌లోనూ చూపిస్తే టైటిల్ గెలవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు.. ఐసీసీ అండర్19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి కెప్టెన్సీ చేసిన షెఫాలీ వర్మతో పాటు యషికా భాటియా కూడా ప్రస్తుతం సీనియర్స్ టీమ్‌లో ఉన్నారు...
అలాగే ఉమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. అయితే టీమిండియాకి ఎదురైన ఏకైక పరాజయం పాక్‌తోనే. దానికి నేటి మ్యాచ్‌లో రివెంజ్ తీర్చుకోవాలనే కసిగా ఉంది హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్.. అయితే స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన గాయం కారణంగా నేటి మ్యాచ్‌లో ఆడకపోవడం టీమిండియాపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
