వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియాతో తలబడుతున్న భారత మహిళా జట్టు... వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా ఆస్ట్రేలియా... టీమిండియాని వెంటాడుతున్న మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ వైఫల్యం... 

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా భారత జట్టు, శనివారం మార్చి 19న పటిష్ట ఆస్ట్రేలియాతో తలబడుతోంది... ఇప్పటివరకూ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ భారీ విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు...

భారత జట్టు నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలు అందుకోగా, రెండు పరాజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. నాలుగు విజయాలతో సౌతాఫ్రికా మహిళా జట్టు రెండో స్థానంలో ఉంటే, వెస్టిండీస్ ఐదు మ్యాచులు ఆడి మూడు విజయాలతో టాప్ 3లో ఉంది...

పాకిస్తాన్ నాలుగు మ్యాచుల్లో నాలుగింట్లోనూ ఓడి ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఆతిథ్య న్యూజిలాండ్ జట్టు ఐదు మ్యాచులాడి రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి... 

ఆస్ట్రేలియా గత విజయాలు, టీమిండియా ప్రస్తుత ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని చూస్తే మాత్రం... ఆసీస్‌ను ఓడించాలంటే భారత మహిళా జట్టు సమిష్టిగా రాణించాల్సిందే. ఇప్పటిదాకా టీమిండియా అందుకున్న రెండు విజయాల్లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన బ్యాటింగ్ భారాన్ని మోస్తే... బౌలర్లు అదరగొట్టి విజయాన్ని అందించారు...

యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ షెఫాలీ వర్మకు ఇప్పటిదాకా వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో తుదిజట్టులో చోటు ఇవ్వలేదు మేనేజ్‌మెంట్. న్యూజిలాండ్‌ టూర్‌లో ఆడిన వన్డే సిరీస్‌లో షెఫాలీ వర్మ ఫెయిల్ అవ్వడంతో యషికా భాటియాని స్మృతి మంధానతో కలిసి ఓపెనింగ్ చేయిస్తోంది టీమిండియా. ఇది కొన్ని మ్యాచుల్లో వర్కవుట్‌ అయినా, యషికా భాటియా త్వరగా అవుటైన మ్యాచుల్లో భారత బ్యాటింగ్ ఆర్డర్ బాగా ఇబ్బందిపడి, స్వల్ప స్కోరుకే ఆలౌట్ కావాల్సి వచ్చింది...

ముఖ్యంగా కెప్టెన్ మిథాలీ రాజ్ పేలవ ఫామ్ భారత జట్టును తీవ్రంగా కలవరబెడుతోంది. కెరీర్‌లో చివరి వరల్డ్ కప్ ఆడుతున్న మిథాలీ రాజ్ బ్యాటు నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా రాలేదు. అలాగే సీనియర్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ కూడా వరుసగా విఫలమవుతోంది...

రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా వంటి జూనియర్లు అటు బ్యాటుతో, ఇటు బంతితో ఆకట్టుకుంటున్నారు. బౌలింగ్‌లో జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్ చక్కగా రాణిస్తున్నారు. టీమిండియా అసలు సమస్య బ్యాటింగ్‌తోనే.ఆడితే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ ఆడాలి... ఆ ఇద్దరూ ఫెయిల్ అయితే, టీమిండియా స్కోరు కార్డు ముందుకు సాగదనే విషయం ఇప్పటికే ప్రత్యర్థి జట్లకి అర్థమై పోయింది...

ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై విజయం సాధించాలంటే దీప్తి శర్మ, మిథాలీరాజ్‌ల బ్యాటు నుంచి మెరుపులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి తమ ఫామ్‌ను కంటిన్యూ చేస్తే... ఆస్ట్రేలియాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదు...

ఆస్ట్రేలియాని 2017 వరల్డ్ కప్ సెమీస్‌లో ఓడించింది భారత మహిళా జట్టు. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా కసిగా ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడితే... ఆ తర్వాత మార్చి 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచుల్లో భారీ తేడాతో తప్పక గెలవాల్సిన పరిస్థితుల్లో పడిపోతుంది టీమిండియా...

అలాంటి ఒత్తిడి లేకుండా ఆడాలంటే ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో విజయం సాధించడం తప్పనిసరి. ప్రస్తుతం పురుషుల క్రికెట్ టోర్నీలేమీ లేకపోవడం, మహిళా క్రికెట్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తుండడంతో భారత మహిళా జట్టుకి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో టీమిండియా ఓడితే, మళ్లీ వుమెన్స్ క్రికెట్‌ని చూడడానికి ఫ్యాన్స్ ఇష్టపడకపోవచ్చు కూడా.