Asianet News TeluguAsianet News Telugu

WI vs IND: విండీస్‌ను తిప్పేసిన భారత స్పిన్ త్రయం.. చివరి మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడిన వెస్టిండీస్

WI vs IND T20I: భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్  ఏ దశలోనూ  ఆ దిశగా సాగలేదు.  టీమిండియా స్పిన్ త్రయం అక్షర్ పటేల్-కుల్దీప్ యాదవ్-రవి బిష్ణోయ్ లు విండీస్ ఇన్నింగ్స్ ను కుప్పకూల్చారు. 
 

WI vs IND 5th T20I: India Beat West Indies by 88 Runs, Clinch The Series With 4-1
Author
India, First Published Aug 7, 2022, 11:48 PM IST

వెస్టిండీస్ పర్యటనను విజయంతో ప్రారంభించిన భారత జట్టు..  విజయంతోనే ముగించింది. ఫ్లోరిడా వేదికగా ముగిసిన ఐదో టీ20లో  టీమిండియా.. 88 పరుగుల తేడాతో  గెలిచింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటర్లు రాణించగా.. తర్వాత స్పిన్నర్లు వెస్టిండీస్ బ్యాటర్ల భరతంపట్టారు. విండీస్ బ్యాటర్లందరూ అక్షర్ పటేల్-కుల్దీప్ యాదవ్- రవి బిష్ణోయ్ ల స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను భారత జట్టు 4-1తో గెలుచుకుంది. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విండీస్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్  ఏ దశలోనూ  ఆ దిశగా సాగలేదు. తొలి ఓవరే స్పిన్నర్ అక్షర్ పటేల్ తో వేయించాడు హార్ధిక్ పాండ్యా.  కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అక్షర్  వమ్ము చేయలేదు. తొలి ఓవర్ మూడో బంతికే అతడు హోల్డర్ (0) ను డకౌట్ చేశాడు. 

అక్షర్ తన మూడో ఓవర్లో  రెండో బంతికి షమ్రా బ్రూక్స్ (13) ను ఔట్ చేయగా.. చివరి బంతికి థామస్ (10) ను కూడా బౌల్డ్ చేశాడు. 5 ఓవర్లకే విండీస్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 33 పరుగులు.  ఆ తర్వాత వచ్చిన  షిమ్రన్ హెట్మెయర్.. ఒక్కడే చివరిదాకా నిలిచాడు.   

థామస్ నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్..(3) ను కుల్దీప్ యాదవ్ ఎల్బీడబ్ల్యూగా  వెనక్కి పంపాడు. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడుతున్నా హెట్మెయర్ మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా ఆడాడు.  అవేశ్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో అతడు రెండు సిక్సర్లు బాదాడు. 

అయితే హెట్మెయర్ దాటిగా ఆడాలని చూసినా అతడికి అండగా నిలిచేవాళ్లే కరువయ్యారు.  పూరన్ నిష్క్రమించాక వచ్చిన రొవ్మన్ పావెల్ (9) ను రవిబిష్ణోయ్.. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పెవిలియన్ చేర్చాడు. అదే ఓవర్లో కీమో పాల్ (0) కూడా పావెల్ బాటనే నడిచాడు. 

ఇక 12వ ఓవర్లో బిష్ణోయ్ అద్భుతం చేస్తే ఆ తర్వాత 13వ ఓవర్లో కుల్దీప్ ఆ మ్యాజిక్ ను కొనసాగించాడు. ఆ ఓవర్లో తొలి బంతికి డ్రేక్స్ (1)  ఔటవగా.. నాలుగో బంతికి ఒడియన్ స్మిత్ (0)  హార్ధిక్ కు క్యాచ్ ఇచ్చాడు.   

బిష్ణోయ్ 16వ ఓవర్లో విండీస్ ఇన్నింగ్స్ కు తెరదించాడు. తొలి బంతిని  హెట్మెయర్ ను ఔట్ చేశాడు. నాలులో బంతికి ఒబెడ్ మెక్‌కాయ్ వికెట్ తీసి విండీస్ ఇన్నింగ్స్ ను ముగించాడు. ఫలితంగా విండీస్.. 15.4 ఓవర్లలో 100 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో రవి బిష్ణోయ్.. నాలుగు వికెట్లు (2.4-0-16-4) తీయగా అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ లు తలో మూడు వికెట్లు పడగొట్టారు. పేసర్లు అర్ష్‌దీప్,  అవేశ్ ఖాన్, హార్ధిక్ పాండ్యాలకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. ఈ విజయంతో భారత్.. ఐదు టీ20ల సిరీస్ ను 4-1తో గెలుచుకుంది. 

 

అంతకుముందు భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు  చేసింది. శ్రేయాస్ అయ్యర్ (64), దీపక్ హుడా (38), హార్ధిక్ పాండ్యా (28)లు రాణించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios