Asianet News TeluguAsianet News Telugu

MS Dhoni: ధోని బ్యాట్ ఎందుకు కొరుకుతాడు..? సీక్రెట్ రివీల్ చేసిన అమిత్ మిశ్రా

TATA IPL 2022: చెన్నై సూపర్ కింగ్స్ సారథి  మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు వచ్చే ముందు తన బ్యాట్ ను కొరకడం అలవాటు.  ఆదివారం కూడా ధోని.. ఢిల్లీ తో మ్యాచ్ లో బ్యాటింగ్ కు వచ్చేముందు ఇలాగే చేశాడు. 

Why MS Dhoni Chewing His Bat before he Comes to Crease, Amit Mishra Explains
Author
India, First Published May 9, 2022, 2:41 PM IST | Last Updated May 9, 2022, 2:43 PM IST

క్రికెట్ లో ఒక్కో ఆటగాడికి ఒక్కో అలవాటు ఉంటుంది.  టీమిండియా దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ బ్యాటింగ్ కు వచ్చేముందు తన కిట్ ను ఎవరినీ ముట్టుకోనివ్వడు. వీరేంద్ర సెహ్వాగ్  బ్యాటింగ్ చేసే సమయంలో  తన ప్యాంట్ ఎడమ జేబులో  రెడ్ కర్చీఫ్ ను ఉంచుకుంటాడు. విరాట్ కోహ్లి ప్రతి బంతి తర్వాత తన బ్యాట్ ను అటూ ఇటూ తిప్పుతాడు.  ఈ కోవలో ధోని కూడా పలు విచిత్రమైన అలవాట్లతో ఉన్నాడు. క్రీజులోకి వచ్చేముందు ధోని.. తన బ్యాట్ ను కొరకడం అలవాటు. గతంలో కూడా అతడు టీమిండియాకు ఆడేప్పుడు ఇలా బ్యాట్ ను కొరకడం చాలా సార్లు చూశారు అభిమానులు. 

తాజాగా  ఢిల్లీ క్యాపిటల్స్ తో తాను క్రీజులోకి రావడానికి కొద్దిసేపు ముందు ధోని తన బ్యాట్ ను కొరుకుతూ కనిపించాడు. మరి ధోని ఎందుకలా బ్యాట్ ను పదే పదే కొరుకుతాడు..?టీమిండియా వెటరన్ క్రికెటర్ అమిత్ మిశ్రా ఇందుకు సమాధానం చెప్పాడు. 

ఢిల్లీతో మ్యాచ్  సందర్భంగా ధోని తన బ్యాట్ కొరుకుతున్న ఫోటో  సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.  ఈ  నేపథ్యంలో అమిత్ మిశ్రా స్పందిస్తూ.. ‘ధోని తన బ్యాట్ ఎందుకిలా కొరుకుతాడని మీరంతా  ఆశ్చర్యపోతుండొచ్చు. అయితే దానికి నేను సమాధానం చెబుతా వినండి.. ధోని తన బ్యాట్ పై ఏదైన టేప్, థ్రెడ్ (దారం) ఉంటే దానిని నోటితో తీసేస్తాడు....

వాటిని తొలగించేందుకే బ్యాట్ ను నోటితో కొరుకుతుంటాడు. తాను బ్యాటింగ్ కు వెళ్లే ముందు ధోని ఇలా చేస్తాడు. మీరెప్పుడైనా గమనించండి.. ధోని బ్యాట్ మీద ఎలాంటి టేప్ గానీ థ్రెడ్ గానీ కనిపించవు..’ అని  పేర్కొన్నాడు. ధోని బ్యాట్ ఎందుకు కొరుకుతాడన్న అభిమానుల సందేహం ఈ విధంగా నెరవేరింది.  ధోని బ్యాట్ ను కొరుకుతున్న ఫోటోతో  పాటు అమిత్ మిశ్రా ట్వీట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది. 

 

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తో  మ్యాచ్ లో చెన్నై ఇన్నింగ్స్ ఆఖర్లో వచ్చిన ధోని.. 8 బంతులలోనే 21 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇందులో ఓ ఫోర్ తో పాటు రెండు సిక్సర్లు కూడా ఉన్నాయి.   ధోని కంటే ముందు సీఎస్కే ఇన్నింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్ (41), డెవన్ కాన్వే (89) వీరవిహారం చేయడంతో  ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగుల భారీ స్కోరు చేసింది. 
భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ.. 17.4 ఓవర్లలో 117 పరుగులు మాత్రమే చేయగలిగింది.  ఫలితంగా చెన్నై 91 పరుగుల తేడాతో విజయం సాధించింది.  రవీంద్ర జడేజా నుంచి  తిరిగి సారథ్య పగ్గాలు అందుకున్న తర్వాత ధోని.. 3 మ్యాచులలో కెప్టెన్సీ చేయగా అందులో ఇది రెండో విజయం కావడం గమనార్హం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios