సారాంశం

SL vs AFG: శుక్రవారం అఫ్గానిస్తాన్  క్రికెట్ జట్టు.. శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడింది.   అయితే ఈ మ్యాచ్ లో  అఫ్గాన్ టీమ్ లో నవీన్ ఉల్ హక్ పేరు కనిపించలేదు.  కోహ్లీతో వాగ్వాదం వల్లే...!

ఐపీఎల్ -16 సందర్భంగా  కోహ్లీతో వాగ్వాదంతో ఫుల్ ఫేమస్ అయ్యాడు అఫ్గానిస్తాన్ పేసర్ నవీన్ ఉల్ హక్.  మే 1న లక్నో వర్సెస్ బెంగళూరుతో మ్యాచ్‌లో భాగంగా కోహ్లీ స్లెడ్జ్ చేయడంతో   దానికి నవీన్ ధీటుగానే బదులిచ్చాడు. అయితే ఈ వివాదం తర్వాత  సోషల్ మీడియాలో నవీన్ చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.  మామిడి పండ్లు బాగున్నాయని కోహ్లీ ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం.. స్టేడియంలో వారిని మరింత ఆగ్రహానికి గురయ్యే విధంగా చేసిన సంజ్ఞలతో వివాదం  చిలికి చిలికి గాలివానగా మారింది.   ఐపీఎల్ ముగిసినా   నవీన్ మరోసారి  నెట్టింట ట్రెండింగ్  లోకి వచ్చాడు. 

శుక్రవారం అఫ్గానిస్తాన్  క్రికెట్ జట్టు.. శ్రీలంకతో వన్డే మ్యాచ్ ఆడింది.   అయితే ఈ మ్యాచ్ లో  అఫ్గాన్ టీమ్ లో నవీన్ ఉల్ హక్ పేరు కనిపించలేదు.  కోహ్లీతో వాగ్వాదం వల్లే అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు  అతడిని  పక్కనబెట్టిందని  కోహ్లీ ఫ్యాన్స్ కొందరు   సోషల్ మీడియాలో కామెంట్స్ చేసి తమ ఇగోను సాటిసిఫై చేసుకున్నారు. కానీ ఇందులో నిజం లేదు. 

వాస్తవానికి నవీన్ ఉల్ హక్.. అఫ్గాన్ వన్డే జట్టులో రెగ్యులర్  మెంబర్ కాదు.  అతడు అఫ్గాన్ తరఫున తన చివరి వన్డేను 2021లో ఆడాడు. నవీన్ ను ఆ జట్టు కేవలం టీ20లకే పరిమితం చేస్తున్నది.  తన కెరీర్ లో  7 వన్డేల ఆడిన నవీన్..  14 వికెట్లు తీశాడు.   టీ20 స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందుతున్న  నవీన్.. ఇప్పటివరకు 27 మ్యాచ్ లు ఆడి   34 వికెట్లు పడగొట్టాడు.  

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే..  హంబన్టోట వేదికగా ముగిసిన తొలి వన్డేలో అఫ్గాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన  శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో  268 పరుగులకు ఆలౌట్ అయింది.  ఆ జట్టులో చరిత్ అసలంక (91), ధనంజయ డిసిల్వ (51) లు రాణించారు. అనంతరం 269 పరుగులు లక్ష్యాన్ని అఫ్గాన్  46.5 ఓవర్లలో ఛేదించింది.  ఆ  జట్టు ఓపెనింగ్ బ్యాటర్  ఇబ్రహీం జద్రాన్.. 98 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు.  రహ్మత్ షా  (55) కూడా హాఫ్  సెంచరీతో రాణించడంతో  అఫ్గాన్.. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.  అఫ్గాన్ జట్టుకు వన్డేలలో లంకపై ఇదే అతిపెద్ద ఛేదన కావడం గమనార్హం.  ఈ విజయంతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో అఫ్గాన్ 1-0 ఆధిక్యంతో ఉంది.  రెండో వన్డే ఆదివారం ఇదే వేదికపై   జరుగనుంది.