Richard Gleeson: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న  టీ20 సిరీస్ లో భాగంగా ఆతిథ్య జట్టు తరఫున ఎంట్రీ ఇచ్చిన రిచర్డ్ గ్లీసన్.. తొలి మ్యాచ్ లోనే  అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. 

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న ఇండియాకు రెండో టీ20లో చుక్కలు చూపెట్టాడు ఆ జట్టు పేసర్ రిచర్డ్ గ్లీసన్. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ వంటి తోపు ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ ఇంగ్లీష్ పేసర్.. ఓ ఓవర్ మెయిడిన్ వేయడమే గాక 3 వికెట్లు కూడా పడగొట్టాడు. భారత బ్యాటర్లు మిగిలిన ఇంగ్లాండ్ బౌలర్లందరి పని పట్టినా గ్లీసన్ బౌలింగ్ లో మాత్రం పరుగులు చేయలేకపోయారు. ఇంతకీ ఎవరీ గ్లీసన్..? 

ఇంగ్లాండ్ లోని నార్తంప్టన్షైర్ కు చెందిన గ్లీసన్.. ఇంగ్లీష్ క్రికెట్ జట్టులో ప్రయాణం ఆసక్తికరంగా సాగింది. అతడు 27 ఏండ్ల దాకా క్రికెట్ ను కెరీర్ గానే ఎంచుకోలేదు. ఏదో సరదాకు ఆడటం తప్ప సీరియస్ గా ట్రై చేసింది లేదు. 

అయితే 27 ఏండ్ల వయసులో తొలిసారి తన జట్టు తరఫున కౌంటీలు ఆడిన గ్లీసన్ దేశవాళీలో రాణించాడు. అయితే దేశవాళీలో ఎంత రాణించినా ఇంగ్లాండ్ జట్టులో జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, క్రిస్ వోక్స్ వంటి బౌలర్ల ధాటికి నిలబడలేకపోయాడు. తీవ్ర పోటీ కారణంతా అతడికి జాతీయ జట్టు తరఫున ఆడే అవకాశం దక్కలేదు. 

అయితే తనకు జాతీయ జట్టులో ఆడే అవకాశం రాకపోయినా గ్లీసన్ మాత్రం కుంగిపోలేదు. 2015న నార్తంప్టన్షైర్ కు తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన గ్లీసన్.. 2018 వరకు ఆ క్లబ్ తోనే కొనసాగాడు. కానీ 2019 లో అతడు లంకాషైర్ కు మారాడు. గత కొద్దికాలంగా నిలకడగా ఆడుతున్న గ్లీసన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2022 లో అదరగొడుతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 34 వికెట్లు తీశాడు. ఇందులో వర్సెస్టర్షైర్ తో మ్యాచ్ లో ఐదు వికెట్ల ప్రదర్శన (5-33) కూడా ఉంది. ఇప్పటివరకు 34 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన గ్లీసన్.. 134 వికెట్లు పడగొట్టడం గమనార్హం. దీంతో అతడికి జాతీయ జట్టులో పిలుపొచ్చింది. 

Scroll to load tweet…

రిటైరవుదామనుకున్నాడు.. కానీ.. 

వయసు మీద పడుతుండటం.. దేశవాళీ క్రికెట్ లో ఎంత బాగా రాణించినా జాతీయ జట్టులోకి రాకపోవడంతో పాటు వెన్ను నొప్పి కారణంగా ఎనిమిది నెలలకు ముందే క్రికెట్ కు గుడ్ బై చెప్దామనుకున్నాడు. కానీ తర్వాత తన మనసు మార్చుకుని ఇందులోనే కొనసాగాడు. ఏడేండ్ల అతడి నిరీక్షణ ఫలించేలా ఇండియాతో శనివారం జరిగిన రెండో మ్యాచ్ లో గ్లీసన్ కు ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. 

ఇంగ్లాండ్ కౌంటీలను పక్కనబెడితే గ్లీసన్.. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) తో పాటు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) లో కూడా ఆడాడు. బీబీఎల్ లో అతడు మెల్బోర్న్ రెనెగ్రెడ్స్ తరఫున ఆడగా.. బీపీఎల్ లో రంగ్పూర్ రైడర్స్ తరఫున మెరిశాడు.