Asianet News TeluguAsianet News Telugu

Ravindra Jadeja: తప్పుకున్నాడా..? తప్పించారా..? జడ్డూ వైదొలగడానికి కారణం ఒత్తిడేనా..?

CSK Captaincy Drama: చెన్నై సూపర్ కింగ్స్ కు ఊహించని షాకిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు ఆ జట్టు  మాజీ సారథి రవీంద్ర జడేజా. ఈ సీజన్ కు ముందు తనకు పగ్గాలు అప్పజెప్పిన ధోనికే  తిరిగి వాటిని అప్పగించాడు.  జడ్డూ వైదొలగడానికి నిజంగా ఒత్తిడే కారణమా..?

What Went Wrong For Ravindra Jadeja, Why He Step down From CSK's Captaincy
Author
India, First Published Apr 30, 2022, 10:27 PM IST | Last Updated Apr 30, 2022, 10:38 PM IST

‘ధోని వారసుడంటే మాములు విషయం కాదన్నది  రవీంద్ర జడేజాకు చాలా తక్కువ సమయంలోనే తెలిసొచ్చింది. లేకుంటే  ధోని నెలకొల్పిన  ఘనతలు, ఆ వారసత్వాన్ని కొనసాగించడమంటే మాటలా..?’ జడ్డూ చెన్నై  సూపర్ కింగ్స్ సారథిగా వైదొలిగిన తర్వాత సోషల్ మీడియాలో కనిపించిన, అత్యధిక మంది నోటి నుంచి వినిపించిన కామెంట్ ఇది. నిజమే.. ధోని వారసత్వాన్ని నిలబెట్టడమనేది  చిన్న విషయం కాదు. అతడు సారథిగా లేని చెన్నైని నడిపించడం కూడా ఆషామాషీ కాదు. కానీ మరీ సగం సీజన్ లోనే సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగేంతనా..? అర్థాంతరంగా  జడేజా తన పదవి నుంచి నిష్క్రమించి చివరికి వాటిని తన గురువుగా భావించే మహేంద్ర సింగ్  ధోనికి అప్పగించడానికి నిజంగా కారణం ఒత్తిడేనా...? ఐపీఎల్ లో ఇప్పుడిదే హాట్ టాపిక్. 

వాస్తవానికి గతేడాది  సీజన్ ముగిశాకే ధోని  సారథ్య బాధ్యతల నుంచి విరామం తీసుకుని వాటిని జడేజా కు గానీ రుతురాజ్ గైక్వాడ్ కు గానీ అప్పజెప్పుతాడని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కు  సరిగ్గా నాలుగు రోజుల ముందు ధోని..  కెప్టెన్సీ పగ్గాలను  జడేజాకు అప్పగించాడు. జడ్డూ కూడా.. ‘ధోని ఉండగా నాకు చింతేలా..?, అన్నీ తాలా చూసుకుంటాడులే..’  అనుకున్నాడు. 

డామిట్.. కథ అడ్డం తిరిగింది.. 

రవీంద్ర జడేజా ఊహించినదానికి పూర్తి రివర్స్ లో జరుగుతోంది ప్రస్తుతం చెన్నై ప్రయాణం.  ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’ అన్న మాదిరిగా తయారైంది జడేజా పరిస్థితి. తొలి మ్యాచ్ లోనే అట్టర్ ఫ్లాఫ్. వరుసగా నాలుగు ఓటములు. ఓ గెలుపు. మళ్లీ ఓ ఓటమి, గెలుపు, పరాజయం అన్నట్లుగా సాగుతోంది చెన్నై ప్రయాణం. అయితే చెన్నై ఓటముల సంగతి పక్కనబెడితే జడ్డూ  ముఖంలో కళ తప్పింది. గతంలో జడ్డూను చూస్తే ఓ పాజిటివ్ ఎనర్జీ కనిపించేది. అదేంటో గానీ ఈ సీజన్ లో 8 మ్యాచులలో   జడ్డూ ముఖంలో అది కనిపించలేదు. నీరసం.  నిస్సహాయత. ఆత్మ విశ్వాసం మచ్చుకైనా లేదు. ‘ఈ మ్యాచ్ మనం గెలుస్తాం..’ అన్న నమ్మకమైతే జడ్డూ ముఖంలో కనిపించలేదు. 

 

ప్రమోటర్లు.. రిస్క్ తీసుకోదలుచుకోలే.. 

జడేజా లో లోపించింది అతడి ఆత్మవిశ్వాసమే కాదు, ప్రమోటర్లు అతడి మీద పెట్టుకున్న నమ్మకం.  వరుసగా పరాజయాల బాట పట్టడంతో  సీఎస్కే యాజమాన్యానికి సీన్ అర్థమైంది. ధోని వారసుడు కచ్చితంగా జడ్డూ అయితే కాదన్నది వాళ్లు ఓ ప్రాథమిక నిర్ధారణ కు వచ్చారు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కే.. ప్లేఆఫ్స్ కు చేరాలంటే తర్వాత జరుగబోయే 6 మ్యాచులను నెగ్గాల్సి ఉంది. అది కష్టమే..? అయినా ప్రమోటర్లు ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట. జడ్డూ నుంచి సారథ్య బాధ్యతలను  వీలైనంత త్వరగా ధోనికి అప్పజెప్పి తర్వాత జరుగబోయే డ్యామేజ్ కు అడ్డుకట్ట వేయాలని చూస్తున్నారని సీఎస్కే వర్గాల భోగట్టా. 

జడేజా ఫామ్ కూడా కారణమే.. 

తాను ముందుండి నడిపిస్తూ మిగతా ఆటగాళ్లను నడిపించేవాడే  నాయకుడు.  కానీ ఈ ఫార్ములా కు జడ్డూ ఆమడ దూరంలో ఉన్నాడు. ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన జడ్డూ.. చేసింది 112 పరుగులు.  టాప్ స్కోరు 26. టీ20 మ్యాచులన్న సంగతి మరిచిపోయి  మరీ టెస్టులు ఆడినట్టు ఆడుతున్నాడు జడేజా.   అతడు వచ్చేదే హిట్టింగ్ పొజిషన్ లో. ఆ టైమ్ లో బంతులను వృథా చేస్తూ మరీ అతి జాగ్రత్తగా ఆడటం కూడా జడ్డూ కొంపముంచింది.   ఇక బౌలింగ్ లో కీలక భాగస్వామ్యాలను విడదీస్తూ.. అవసరమైనప్పుడు వికెట్లు తీయగలిగే సత్తా ఉన్న అతడు.. ఈ సీజన్ లో 26 ఓవర్లు వేసి తీసింది 5 వికెట్లు. ఇచ్చుకున్న పరుగులు 213. 

ఒత్తిడి సహజమే.. కానీ...

క్రికెట్ లో గానీ మరే ఇతర ఆటలో గానీ నాయకత్వం అంటేనే ఒత్తిడి. అది కాదనడనాకి అవకాశం లేని ప్రక్రియ. అందరు కెప్టెన్ల మాదిరిగానే జడేజాకు ఒత్తిడి ఉంది.  కానీ అది సారథ్య బాధ్యతలను సైతం   అర్థాంతరంగా అప్పగించేంతనా..? అంటే మాత్రం అనుమానమే.  జడేజా ఇప్పుడే క్రికెట్ లోకి వచ్చిన యువ ఆటగాడేం కాదు.  సుమారు పదేండ్ల కంటే ఎక్కువ కాలంగానే  అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నాడు. ధోని వారసత్వాన్ని మోయడం కష్టమే గానీ  జట్టు పరాజయాలన్నింటికీ జడేజా  ఒక్కడే బాధ్యుడు కాదు. క్రికెట్ అనేది సమిష్టిగా ఆడే ఆట.

గతేడాది ఓపెనర్ గా సూపర్ సక్సెస్ అయిన  రుతురాజ్ గైక్వాడ్ ఈ ఏడాది దారుణంగా విఫలమవుతున్నాడు. డాడీస్ గ్యాంగ్ అంబటి రాయుడు,  రాబిన్ ఊతప్ప, మోయిన్ అలీ లు బ్యాటింగ్  లో అడపా దడపా రాణించిందే తప్ప మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు.  ఇక బౌలింగ్ లో డ్వేన్ బ్రావో తప్ప మిగిలిన వాళ్లెవరిలోనూ నిలకడ లేదు.  వీటన్నింటికీ మించి వేలంలో చెన్నై దక్కించుకున్న రూ. 14 కోట్ల ఆటగాడు దీపక్ చాహర్ లేకపోవడం  ఆ జట్టుకు భారీ ఎదురుదెబ్బ. మానసికంగా చెన్నైని అది బాగా కుంగదీసింది.  ఇన్ని సమస్యలున్నా జడేజా ను బలి పశువుగా చేసి  అతడిని అర్థాంతరంగా సాగనంపడం అనేది అతడు కూడా జీర్ణించుకోలేనిదే. 

 

తక్షణ కర్తవ్యం..? 

జడేజా నుంచి తిరిగి  నాయకత్వ పగ్గాలు ధోనికి బదిలి అయిపోయాయి.  ధోని మ్యాజిక్ తో సీఎస్కే ప్లేఆఫ్స్ చేరుతుందా..? లేదా..?  అనేది పక్కనబెడితే రవీంద్ర జడేజా తన స్టేట్మెంట్ (సీఎస్కే ట్విట్టర్ లో విడుదల చేసింది) చెప్పినట్టు తిరిగి  తన ఆట మీద దృష్టి పెట్టినా అతడికి ప్రత్యేకించి ఒరిగేదేమీ లేదు.  జరగాల్సిన నష్టం జరిగిపోయింది.  ధోని వారసుడి కోసం చెన్నై మళ్లీ జల్లెడ పట్టాల్సిందే.  తన ప్లాన్-బి ప్రకారం ధోని వాటిని  రుతురాజ్ కు అప్పజెప్పుతాడా..?  లేక తానే  ఈ సీజన్ దాకా కొనసాగి ఆ భారాన్ని కూడా యాజమాన్యం మీద మోపి చేతులు దులుపుకుంటాడా..?  అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios