టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. తాజాగా దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మాములగా అయితే.. ఈ టైంలో ఐపీఎల్ తో క్రికెటర్లంతా సందడి చేసేవారు. అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోయి  చూసేవారు.

కానీ కరోనా కారణంగా అంతా తారుమారు అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి తోచినట్లుగా వారు టైంపాస్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే డివిలియర్స్ తో కలిసి ఇన్ స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చి కోహ్లీ సందడి చేశాడు.

ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ లో పలు విషయాలను ఇద్దరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ తాను ఆర్సబీని వీడనని కూడా చెప్పారు.

 

వీరిద్దరి లైవ్ ఛాట్ చాలాసేపే జరిగింది. వీరి సంభాషణ ఇప్పుడు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుండగా.. ఈ లైవ్ బాగా జరగడానికి కోహ్లీ సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కారణమట. ఈ విషయాన్ని కోహ్లీ పేర్కొన్నారు. కోహ్లీ లైవ్ లో మాట్లాడుతుండగా.. చీకట్లో ఉన్నాడని ఆమె లైట్స్ ఆన్ చేశారు. వెంటనే కోహ్లీ.. థాంక్యూ మైలవ్ అని చెప్పేశారు.

 ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఓ అభిమాని ఏకంగా.. విరాట్  ధాంక్యూ మై లవ్ అంటూ అనుష్కకి చెప్పాడంటూ  స్పెషల్ పోస్టు కూడా పెట్టారు. ఈ పోస్టు కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇదిలా ఉండగా.. ఐపీల్ గురించి కోహ్లీ మాట్లాడుతూ... ‘‘ఆర్సీబీ టీమ్‌తో 12 ఏళ్ల ప్రయాణం మరిచిపోలేనిది. ఐపీఎల్‌లో బెంగళూరు టీమ్ అంతిమ లక్ష్యం టైటిల్ గెలవడం. కానీ.. మూడు సార్లు కొద్దిలో టైటిల్ మాకు చేజారింది. అయినప్పటికీ.. పట్టు వదలకుండా ప్రతి సీజన్‌లోనూ పోరాడుతున్నాం. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఆర్సీబీని వీడే ప్రసక్తి లేదు. కొన్ని సీజన్లలో ఓటములతో భావోద్వేగాలకి గురవుతాను. కానీ.. ఎప్పుడూ టీమ్‌ని వీడాలని ఆలోచనే నాకు రాలేదు’’ అని వెల్లడించాడు.