టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లో రాహుల్ ద్రవిడ్ చివరి ప్రసంగం.. ఏం చెప్పాడంటే?
Team India - Rahul Dravid : టీమిండియాకు అద్భుతమైన ఆనందకరమైన క్షణాలు.. అపురూపమైన జ్ఞాపకాల్లో తాను భాగమైనందుకు మాటల్లో చెప్పలేని ఆనందంగా ఉందని భారత లెజెండరీ క్రికెటర్, టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు.
Team India - Rahul Dravid : క్రికెట్ ప్రపంచంలో అనేక రికార్డులు బద్దలు కొట్టాడు. తనదైన తరహా బ్యాటింగ్ తో అదరగొడుతూ 'ది గ్రేట్ వాల్' గా లెజెండరీ ప్లేయర్ గా ఘనత సాధించాడు. కానీ, అతని కెప్టెన్సీలో 2007 లో వన్డే క్రికెట్ లో ఐసీసీ ట్రోఫీని అందుకోవడంలో వెనుకబడటంతో నిరాశతో నిష్క్రమించింది. కానీ, ఇప్పుడు ఆ లెజెండరీ ప్లేయర్ బలంతో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 ను గెలుచుకుంది. ఆయనే భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్.. టీ20 ప్రపంచ కప్ 2024 విజయంలో ఆయన సేవలు మరువలేనివి. ఆయన ప్రధాన కోచ్ గా ఉన్న సమయంలో భారత జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందించారు.
ఈ ప్రపంచ కప్ ముగింపుతో భారత జట్టు ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల డ్రెస్సింగ్ రూమ్‌లో ద్రావిడ్ చివరి వీడ్కోలు ప్రసంగాన్ని పంచుకుంది. రాహుల్ ద్రవిడ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. టీ20 ప్రపంచ కప్ 2024 ను గెలుచుకున్న చిరస్మరణీయ ప్రయాణంలో భాగమైనందుకు ద్రవిడ్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భారత జట్టు ముందుకు సాగుతున్న తీరుతో గర్వంగా ఉందని తెలిపారు. ఈ ప్రయాణంలో ఆటగాళ్లు, వారి కుటుంబాలు, కోచ్‌ల సహా టీమిండియా సిబ్బంది త్యాగాలు మరువలేనివని గుర్తుచేశారు.
2023 క్రికెట్ ప్రపంచ కప్ ఓటమి తర్వాత మరోసారి తన పదవీకాలన్ని పొడిగించాలని నిర్ణయించినందుకు బీసీసీఐతో పాటు రోహిత్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. జట్టుకోసం తాము చేసిన అన్నింటికీ బీసీసీఐ ఇచ్చిన సపోర్టును ప్రత్యేకంగా ప్రస్తావించారు. "నాకు నిజంగా మాటలు రావడం లేదు.. ఇది గొప్ప క్షణం.. కానీ నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే.. అపురూపమైన జ్ఞాపకంలో నన్ను భాగం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ ఈ గొప్ప క్షణాలు గుర్తుంటాయని నేను అనుకుంటున్నాను. ఇది పరుగుల గురించి కాదు.. వికెట్ల గురించి కాదు.. కానీ మనం నిజంగా దీన్ని ఆస్వాదిద్దాం, మీరు చేసిన విధంగా, మీరు పోరాడిన విధానం గురించి నేను చాలా గర్వంగా ఉన్నాను" అని బీసీసీఐ పోస్టు చేసిన వీడియో ద్రవిడ్ అన్నారు.
అలాగే, "రో (రోహిత్) కు ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను.. నవంబర్‌లో నాకు ఆ కాల్ చేసినందుకు.. నన్ను కొనసాగించమని కోరినందుకు చాలా ధన్యవాదాలు. మీలో ప్రతి ఒక్కరితో ఆడటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను.. మా గొప్ప జట్టు వెనుక, ఒక విజయవంతమైన సంస్థ కూడా ఉంది. అదే బీసీసీఐ.. తెరవెనుక వారు మా కోసం చేసిన పని చాలా గొప్పది.. మనలో ప్రతి ఒక్కరూ ఒక వ్యవస్థ ద్వారా వస్తున్నారు. మాకు ఎదగడానికి.. ఆడటానికి అవకాశాలను అందించే ఈ సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు" అని ద్రావిడ్ తన ప్రసంగాన్ని ముగించారు.