ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ ని సరిగా వాడుకోలేకపోయారంటూ ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైకేల్ వాన్ పేర్కొన్నాడు. జోస్ బట్లర్ ని ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సోమవారం నాటి మ్యాచ్ లో బట్లర్ కి కీపింగ్ బాధ్యతలు అప్పగించకపోవడంపై మైకేల్ వాన్ ప్రశ్నించాడు.

అదే విధంగా అతడిని మిడిల్‌ ఆర్డర్‌లో ఆడించడం పట్ల కూడా పెదవి విరిచాడు. కాగా ఐపీఎల్‌ -2021 సీజన్‌లో సోమవారం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఆఖరివరకు ఉత్కంఠరేపిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది. తద్వారా విజయంతో బోణీ కొట్టింది.

ఇదిలా ఉండగా, అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీ(119) చేసి విజయానికి చేరవవుతున్న సమయంలో అవుట్‌ కావడంతో ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ సామ్సన్‌కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘జోస్‌ బట్లర్‌ వంటి అద్భుతమైన అనుభవం గల ఆటగాడు ఉండగా, అతడిని ఎందుకు కీపర్‌ స్థానంలో తీసుకోలేదు. అంతేకాదు అతడితో ఎందుకు ఓపెనింగ్‌ చేయించలేదు!!!! అసలు మీరేం ఆలోచిస్తున్నారు’’ అంటూ రాజస్తాన్‌ జట్టు తీరుపై విమర్శలు గుప్పించాడు. 

కాగా సోమవారం నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌ సంజూ సామ్సన్‌ వికెట్‌ కీపర్‌గా బరిలోకి దిగగా, బెన్‌స్టోక్స్‌, మనన్‌ వోహ్రా ఓపెనింగ్‌ చేశారు. స్టోక్స్‌ పరుగులేమీ చేయకుండానే షమీ బౌలింగ్‌లో వెనుదిరగగా, వోహ్రా కేవలం 12 పరుగులు చేశాడు. ఇక జోస్‌ బట్లర్‌ 25 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక గత రెండు సీజన్లలో ఆర్‌ఆర్‌ తరఫున ఓపెనింగ్‌ చేసిన బట్లర్‌ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌ తరఫున అతడు టీ20ల్లో ఓపెనింగ్‌ చేస్తాడన్న సంగతి తెలిసిందే.