WI vs IND ODI: వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు కరేబియన్ జట్టుతో నేడు రెండో వన్డేలో తలపడుతున్నది. ఇప్పటికే తొలి వన్డే నెగ్గిన భారత జట్టు.. ఈ మ్యాచులో కూడా గెలిచి సిరీస్ పట్టేయాలని చూస్తున్నాది.
వెస్టిండీస్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడుతున్నది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని ధావన్ సేన భావిస్తుండగా.. తొలి వన్డేలో కొద్దితేడాతో అపజయం పాలైన విండీస్ మాత్రం.. ఈ మ్యాచ్ లో నెగ్గి భారత్ కు షాకివ్వాలని చూస్తున్నది. ఇరు జట్లకు కీలకంగా మారిన నేటి వన్డేలో టీమిండియా టాస్ ఓడి తొలుత బౌలింగ్ కు రానుంది. వెస్టిండీస్ బ్యాటింగ్ చేయనుంది.
తొలి వన్డేలో ఆడిన జట్టులో ప్రసిధ్ కృష్ణకు భారత జట్టు విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో అవేశ్ ఖాన్ వన్డేలలో అరంగేట్రం చేశాడు. విండీస్ జట్టులో మార్పులేమీ లేవు.
ఇక తొలి వన్డేలో మాదిరిగానే ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభమన్ గిల్ మరోసారి చెలరేగాలని భారత్ కోరుకుంటున్నది. వీరికి తోడు వన్ డౌన్ లో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తొలి వన్డేలో రాణించాడు. అయితే భారత మిడిలార్డర్ ఆ మ్యాచ్ లో దారుణంగా విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, దీపక్ హుడాలు అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ మ్యాచ్ లో వీళ్లు బాగా ఆడటం ఆవశ్యకం.
బౌలింగ్ లో భారత్ కు మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ లతో పాటు అవేశ్ ఖాన్ కూడా జతకలిశాడు. స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ లు రాణిస్తే భారత్ కు తిరుగుండదు.
ఇక తొలి వన్డేలో మూడు పరుగుల తేడాతో ఓటమి పాలైన విండీస్ జట్టు ఈ మ్యాచ్ లో మాత్రం ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నది. తొలి మ్యాచ్ లో రాణించిన బ్రాండన్ కింగ్, బ్రూక్స్ లతో పాటు మేయర్స్, నికోలస్ పూరన్ ల మీద ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వీళ్లు చెలరేగితే భారత జట్టుకు కష్టాలు తప్పవు. ఏడో నెంబర్ బ్యాటర్ దాకా బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగిన విండీస్ ను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు కష్టపడాల్సిందే.
తుది జట్లు :
ఇండియా : శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్
వెస్టిండీస్ : షై హోప్, బ్రాండన్ కింగ్, షమ్రా బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రొవ్మన్ పావెల్, అకీల్ హోసెన్, రొమారియా షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడన్ సీల్స్, హెడెన్ వాల్ష్
