టీమిండియా దెబ్బకు వెస్టిండిస్ జట్టు విలవిల్లాడిపోతోంది. ఇప్పటికే టీ20, వన్డే సీరీసుల్లో ఘోర ఓటమిని చవిచూసిన విండీస్ టెస్ట్ సీరిస్ లోనూ అదే చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. ఇలా రెండు టెస్టుల సీరిస్ ను కూడా కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసేలా కనిపిస్తోంది. ఆంటిగ్వా వేదికన జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా ఏకంగా 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ  మ్యాచ్ లో విండీస్ చెత్త ఆటతీరుతో 13ఏళ్ల తర్వాత మరోసారి అత్యంత ఘోర ఓటమిని చవిచూసింది. ఇలా తన పేరిట వున్న చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. 

రెండో ఇన్నింగ్స్ లో విండీస్ 419 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 100 పరుగులకే ఆలౌటయ్యింది. ఇలా టీమిండియాపై ఓ ఇన్నింగ్స్ లో అతి తక్కువ స్కోరును సాధించింది. 2006లో కింగ్ స్టన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కరీబియన్ జట్టు 103 పరుగులకే ఆలౌటయ్యంది. ఇప్పటివరకు ఇదే అతితక్కువ  స్కోరు కాగా తాజాగా కేవలం 100 పరుగులకే ఆలౌటైన విండీస్ 13ఏళ్లనాటి తన చెత్త రికార్డును తానే బద్దలుగొట్టుకుంది. 

అంతేకాకుండా ఓవరాల్ గా చూసుకున్నా 318 పరుగుల తేడాతో ఓటమిపాలైన విండీస్ మరోచెత్త రికార్డును కూడా మూటగట్టకుంది. 1988లో భారత్ చేతిలో విండీస్ జట్టు 255 పరుగుల తేడాతో ఓడింది. ఇప్పటివరకు ఇదే అత్యంత ఘోర ఓటమికాగా తాజాగా 318 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలయ్యింది. ఇలా 31క్రితంనాటి తన చెత్త రికార్డును వెస్టిండిస్ జట్టు బద్దలుగొట్టింది.  

ఈ టెస్ట్ లో భారత బ్యాట్స్ మెన్స్ రహానే, విహారీ, కోహ్లీలు బౌలర్లలో ఇషాంత్, బుమ్రా, షమీలు అదరగొట్టారు. దీంతో వెస్టిండిస్ ను మరోసారి చిత్తుచేసి టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియాకు శుభారంభం లభించింది. అలాగే టీ20, వన్డే సీరిస్ ల మాదిరిగానే టెస్ట్ సీరిస్ ను కూడా  క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని పొందింది.