వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో ఆడిన జాసన్ హోల్డర్, అల్జెరీ జోసఫ్ మాత్రమే టెస్టు టీమ్‌లో అవకాశం... గాయంతో తప్పుకున్న కైల్ మేయర్స్..
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్ జట్టు, క్వాలిఫైయర్స్‌లో జరిగిన ఆఖరి మ్యాచ్‌లోనూ శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమి తర్వాత స్వదేశానికి తిరిగి రాబోతున్న వెస్టిండీస్, టీమిండియాతో జరిగే తొలి టెస్టుకి జట్టును ప్రకటించింది.. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా వ్యవహరించే వెస్టిండీస్ టెస్టు టీమ్‌కి జెర్మైన్ బ్లాక్‌వుడ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో ఆడిన ఫాస్ట్ బౌలర్ జాసన్ హోల్డర్‌తో పాటు అల్జెరీ జోసఫ్ మాత్రమే టెస్టు టీమ్‌లో అవకాశం దక్కించుకోగలిగారు..
ఇప్పటిదాకా టెస్టు ఆరంగ్రేటం చేయని లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ క్రిక్ మెక్‌కెంజీకి 13 మందితో కూడిన జట్టులో అవకాశం కల్పించిన వెస్టిండీస్, రహ్కీం కార్న్‌వాల్, జోమెల్ వర్రీకాన్‌లను చాలా రోజుల తర్వాత తిరిగి టీమ్‌లోకి తీసుకుంది. 2019లో టీమిండియాపైనే ఆరంగ్రేటం చేసిన రహ్కీం కార్న్‌వాల్, ఇప్పటిదాకా 9 టెస్టుల్లో 34 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 2 హాఫ్ సెంచరీలతో 238 పరుగులు చేశాడు..
2021 నవంబర్‌లో చివరిగా టెస్టు మ్యాచ్ ఆడిన రహ్కీం కార్న్‌వాల్ 140 కిలోలకు పైగా బరువుతో భారీ ఖాయంతో ఉంటాడు. ఆరంగ్రేటం నుంచి టెస్టుల్లో అదరగొడుతున్న కైల్ మేయర్స్, ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. అలాగే ఫాస్ట్ బౌలర్ జేడన్ సీల్స్ కూడా గాయంతో బాధపడుతుండడంతో ఈ ఇద్దరికీ తొలి టెస్టు టీమ్‌లో చోటు దక్కలేదు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓపెనర్‌గా వ్యవహరించిన కైల్ మేయర్స్ మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. తొలి టెస్టులో ఆడకపోయినా రెండో టెస్టు నాటికి కైల్ మేయర్స్ పూర్తిగా కోలుకుంటాడని క్రికెట్ వెస్టిండీస్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపాడు...
తొలి టెస్టుకి వెస్టిండీస్ జట్టు ఇది: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అతనజ్, టగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెక్‌కెంచీ, రేమన్ రిఫర్, జోషువా డి సిల్వ, జాసన్ హోల్డర్, కీమర్ రోచ్, షన్నాన్ గ్యాబ్రిల్, అల్జెరీ జోసఫ్, జోమెల్ వర్రీకాన్, రహ్కీం కార్న్‌వాల్
వీరితో పాటు తెవిన్ ఇంలాచ్, అకీం జోర్డాన్‌లను రిజర్వు ప్లేయర్లుగా ప్రకటించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. జూన్ 12న భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలు తొలి టెస్టు ప్రారంభం అవుతుంది. మూడు సెషన్ల ఆట ముగిసే సమయానికి అర్ధ రాత్రి 2 గంటలు అవుతుంది.
తొలి టెస్టులో భారత జట్టు తరుపున యశస్వి జైస్వాల్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నాడని సమాచారం. అదే జరిగితే మొదటి టెస్టులో భారత జట్టు ఇలా ఉండొచ్చు.
తొలి టెస్టుకి భారత టీమ్ (అంచనా మాత్రమే): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్/ ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ (ముకేశ్ కుమార్), జయ్‌దేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్
