భారత జట్టు ప్లేయర్లను కలిసి ముచ్ఛటించిన విండీస్ లెజెండరీ క్రికెటర్ బ్రియాన్ లారా... ఫోటో, వీడియోలను షేర్ చేసిన బీసీసీఐ...

వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టుకి ఆ దేశ మాజీ క్రికెటర్, లెజెండరీ బ్యాటర్ బ్రియాన్ లారా స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ట్రిడినాడ్‌లో జరిగిన తొలి వన్డే ముగిసిన తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్‌లో బ్రియాన్ లారాని చూసి, భారత క్రికెటర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు...

భారత సీనియర్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... బ్రియాన్ లారాను కలిసి కాసేపు ముచ్ఛటించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది బీసీసీఐ...

Scroll to load tweet…

అలాగే టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌ని కలిసి, కాసేపు మాట్లాడాడు బ్రియాన్ లారా. ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీసీసీఐ... ‘ఇద్దరు లెజెండ్స్, ఒక్క ఫ్రేమ్...’ అంటూ కాప్షన్ జోడించింది...

Scroll to load tweet…

టెస్టుల్లో 400 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచిన బ్రియాన్ లారా, తన కెరీర్లో 131 టెస్టులు, 299 వన్డే మ్యాచులు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్లో 53 సెంచరీలు, 111 హాఫ్ సెంచరీలు చేసిన బ్రియాన్ లారా... ట్రిడినాడ్ అండ్ టొబాగోలో జన్మించాడు...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించిన బ్రియాన్ లారా, ‘ది ప్రిన్స్ ఆఫ్ పోర్ట్ ఆఫ్ స్పెయిన్’, ‘ది ప్రిన్స్’గా నిక్ నేమ్‌ సంపాదించుకున్నాడు...

వెస్టిండీస్‌, టీమిండియా మధ్య జరిగిన తొలి వన్డే, అసలు సిసలు వన్డే మజాని అందించింది. ఆఖరి ఓవర్ వరకూ చేతులు మారుతూ పూర్తిగా 100 ఓవర్ల పాటు సాగిన తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుని, సిరీస్‌లో బోణీ కొట్టింది భారత జట్టు.. 

విండీస్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు కావాల్సి వచ్చాయి. 50వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్ మొదటి బంతికి పరుగులేమీ ఇవ్వలేదు. రెండో బంతికి సింగిల్ తీసిన అకీల్ హుస్సేన్, సిఫర్డ్‌ని స్ట్రైయిక్ ఇచ్చాడు. మూడో బంతికి ఫోర్ బాదిన రొమారియో సిఫర్డ్... నాలుగో బంతికి 2 పరుగులు తీశాడు. ఆ తర్వాతి బంతి వైడ్‌గా వెళ్లడంతో చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి వచ్చాయి.

ఐదో బంతికి 2 పరుగులు తీసిన రొమారియో, ఆఖరి బంతికి 5 పరుగులు కావాల్సిన దశలో సింగిల్ మాత్రమే ఇచ్చిన సిరాజ్... భారత జట్టుకి విజయాన్ని అందించాడు. రొమారియో సిఫర్డ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు, అకీల్ హుస్సేన్ 32 బంతుల్లో 2 ఫోర్లతో 33 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.