విండీస్ ఆటాడుకున్న టీమిండియా బౌలర్లు... మనోళ్ల సెంచరీలు చూద్దామనుకుంటే...
23 ఓవర్లలోనే 114 ఆలౌట్ అయిన వెస్టిండీస్... కుల్దీప్ యాదవ్‌కి 4 వికెట్లు, 3 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా..

వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో స్కాట్లాండ్, నెదర్లాండ్స్, జింబాబ్వే వంటి అసోసియేట్ దేశాల చేతుల్లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్ జట్టును, టీమిండియా మొదటి వన్డేలో ఓ ఆటాడుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు, 23 ఓవర్లలోనే 114 ఆలౌట్ అయిపోయింది.. వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్‌మన్ గిల్ సెంచరీలు చూద్దామని ఆశపడిన టీమిండియా ఫ్యాన్స్‌కి విండీస్ స్కోరు చూసి... షాక్ అవ్వడమే మిగిలింది.
మహ్మద్ సిరాజ్ గాయంతో స్వదేశానికి తిరిగి వెళ్లిపోవడంతో హార్ధిక పాండ్యాతో ఓపెనింగ్ ఓవర్ వేయించాడు రోహిత్ శర్మ. 9 బంతుల్లో 2 పరుగులు చేసిన కైల్ మేయర్స్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. నేటి మ్యాచ్ ద్వారా వన్డే ఆరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్, మొదటి ఓవర్‌ని మెయిడిన్‌గా వేశాడు..
18 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన అలిక్ అతనజే, ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లతో 17 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్‌ని, శార్దూల్ ఠాకూర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది వెస్టిండీస్..
నాలుగో వికెట్‌కి 43 పరుగులు జోడించిన సిమ్రాన్ హెట్మయర్‌ని రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు చేసిన హెట్మయర్, రీఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 4 బంతుల్లో ఓ ఫోర్ బాదిన రోవ్‌మెన్ పావెల్ 4 పరుగులు చేసి జడ్డూ బౌలింగ్ అవుట్ కాగా, 2 బంతులు ఆడిన రొమారియో షెఫర్డ్ కూడా, జడేజా బౌలింగ్‌లోనే విరాట్ కోహ్లీ పట్టిన సూపర్ క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు..
డొమినికా డ్రేక్స్ 3 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. యానిక్ కరియా కూడా 3 పరుగులే చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లోనే ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా డీఆర్‌ఎస్ తీసుకున్న టీమిండియాకి అనుకూలంగా ఫలితం వచ్చింది..
ఓ వైపు వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కెప్టెన్ షై హోప్ క్రీజులో కుదురుకుపోయి 43 పరుగులు చేయడంతో వెస్టిండీస్ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన షై హోప్‌ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, అదే ఓవర్‌లో జేడన్ సీల్స్‌ని డకౌట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది..
3 ఓవర్లలో 2 మెయిడిన్లతో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగట్టాడు కుల్దీప్ యాదవ్. రవీంద్ర జడేజాకి 3 వికెట్లు దక్కగా శార్దూల్ ఠాకూర్, హార్ధిక్ పాండ్యా, ముకేశ్ కుమార్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. టీమిండియాపై వెస్టిండీస్‌కి ఇది రెండో అత్యల్ప స్కోరు. ఇంతకుముందు 2018లో తిరువనంతపురంలో జరిగిన వన్డేలో 104 పరుగులకి ఆలౌట్ అయ్యింది వెస్టిండీస్..